Kadiam Srihari: కేసీఆర్ వ్యాఖ్యలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలయింది: కడియం శ్రీహరి

BJP leaders are shaking after KCR comments says Kadiam Srihari
  • కేంద్ర బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించింది ఏమీ లేదు
  • తెలంగాణ ప్రభుత్వం పెట్టినంత బడ్జెట్ కూడా కేంద్రం కేటాయించలేదు
  • బీజేపీ నేతలు సన్నాసులు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్ర బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించింది ఏమీ లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం పెట్టినంత బడ్జెట్ కూడా కేంద్రం కేటాయించలేదని మండిపడ్డారు.

మన దేశంలో షెడ్యూల్డ్ కాస్ట్ కు చెందిన వారు 28 శాతం మంది ఉన్నారని... అయినా, కేంద్ర ప్రభుత్వం వారికి కేవలం రూ. 20 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. దళితబంధు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్లు ఖర్చు పెడుతోందని అన్నారు. చేతనైతే దళితబంధులాంటి పథకాన్ని దేశ వ్యాప్తంగా కేంద్రం అమలు చేయాలని సవాల్ విసిరారు.

బీజేపీ నాయకులు చేతకాని సన్నాసులు అని కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా బీజేపీ నేతలకు లేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తే... బీజేపీ నేతలను తెలంగాణ ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలలో వణుకు మొదలైందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలోని ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారని... పేదవారి జీవితాలు మరింత ఘోరంగా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు విభజన చట్టం హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.  
Kadiam Srihari
KCR
TRS
BJP
Union Budget

More Telugu News