Cricket: ఎన్నిరోజులని పాతబైకుపై తిరుగుతాం.. అందుకే సెకండ్ హ్యాండ్ కారు కొన్నా: హైదరాబాదీ పేసర్​ సిరాజ్

  • ఐపీఎల్ తొలిపారితోషికంపై వ్యాఖ్య
  • అప్పటికి డ్రైవింగ్ రాదని వెల్లడి
  • దానికన్నా ముందు ఐఫోన్ 7 ప్లస్ కొన్నానన్న సిరాజ్ 
Bought Second Hand Car with First IPL Remuneration Says Siraj

ఐపీఎల్ లో వచ్చిన తొలి పారితోషికాన్ని ఎలా వినియోగించుకున్నాడో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు. తాను ఆడుతున్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించిన పాడ్ కాస్ట్ లో అతడు తన అనుభవాలను పంచుకున్నాడు. అతడితోపాటు కోహ్లీ, దేవ్ దత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్ వెల్ తదితరులూ అందులో మాట్లాడారు.

తొలిసారిగా సిరాజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్ లోనే 6 మ్యాచ్ లాడి 10 వికెట్లు పడగొట్టాడు. అందరి దృష్టినీ అతడు ఆకర్షించాడు. ఆ సీజన్ లో తనకు వచ్చిన తొలి పారితోషికంతో మొదట ఐఫోన్7 ప్లస్ కొన్నానని ఆర్సీబీ పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత టయోటా కరోలా సెకండ్ హ్యాండ్ కారు కొన్నానని తెలిపాడు.

‘‘ఎన్ని రోజులని పాత బైకుపై తిరుగుతాం? ఐపీఎల్ లో ఆడుతున్నామంటే ఆ మాత్రం ఉండాలి కదా! అందుకే కొన్నా. అయితే, అప్పటికి నాకు ఇంకా కారు నడపడం రాదు. దీంతో మా కజిన్ ను తీసుకెళ్లేవాడిని’’ అని చెప్పుకొచ్చాడు. కాగా, 2017లో సిరాజ్ ను ఆర్సీబీ రూ.2.6 కోట్లు పెట్టి వేలంలో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ, మ్యాక్స్ వెల్ తో పాటు సిరాజ్ నూ రిటెయిన్ చేసుకుంది. రూ.7 కోట్లు చెల్లించనుంది.

More Telugu News