Manoj Tiwary: ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పశ్చిమ బెంగాల్ క్రీడల మంత్రి... కనీస ధర ఎంతంటే...!

West Bengal Sports Minister Manoj Tiwary up for IPL Players Auction
  • వేలానికి పేరు నమోదు చేసుకున్న మనోజ్ తివారీ
  • గతంలో టీమిండియాకు ఆడిన వైనం
  • ఐపీఎల్ లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం
  • గతేడాది తృణమూల్ కాంగ్రెస్ లో చేరిక
  • శిభ్ పూర్ స్థానం నుంచి విజయం
  • క్రీడల మంత్రిగా నియమించిన మమత
ఐపీఎల్-15 మెగా వేలం ప్రక్రియకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా ఐపీఎల్ పాలకమండలి వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మనోజ్ తివారీ కూడా ఉండడం విశేషం. మనోజ్ తివారీ బెంగాల్ క్రికెటర్. తివారీ గతంలో టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. 12 వన్డేలు, 3 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

తివారీ ఐపీఎల్లో ఇప్పటివరకు కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్ జట్లకు ఆడాడు. మనోజ్ తివారీ గతేడాది పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో శిభ్ పూర్ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా గెలుపొందాడు. క్రికెటర్ కావడంతో ఆయనను సీఎం మమతా బెనర్జీ క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా నియమించారు.

కాగా, మనోజ్ తివారీ చివరిసారిగా 2018లో ఐపీఎల్ ఆడాడు. ఈసారి వేలంలో తివారీ తన కనీస ధరను రూ.50 లక్షలుగా పేర్కొన్నాడు. మంత్రిగా ఉన్న తివారీని ఏ ఫ్రాంచైజీ కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అసలు కొంటారా? లేదా? అనే సందేహాలు కూడా ఉన్నాయి.
Manoj Tiwary
Spors Minister
West Bengal
IPL
Auction

More Telugu News