Mars: మన భూమ్మీదే అంగారకుడి తరహా వాతావరణం... ఎక్కడంటే..!

  • అంగారకుడిపై విస్తృత పరిశోధనలు
  • రోవర్ ను ప్రయోగించిన నాసా
  • కోస్టారికాలో పోవోస్ అగ్నిపర్వతం
  • అంగారకుడ్ని తలపించేలా కఠిన వాతావరణం
Mars like atmosphere on earth

అంగారక గ్రహం గుట్టుమట్లు తెలుసుకునేందుకు నాసా, తదితర అంతరిక్ష పరిశోధన సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. భూమికి ఆవల జీవం ఉందా? ఉంటే అక్కడ మానవుడికి మనుగడ సాధ్యమేనా? అనే అంశాలకు సమాధానం కోసం అరుణగ్రహాన్ని శోధించాలని నాసా ఎప్పటినుంచో శ్రమిస్తోంది. అందుకోసం పెర్సీవరెన్స్ రోవర్ ను కూడా అంగారక గ్రహ ఉపరితలంపై మోహరించింది.

అయితే యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కోస్టారికాకు చెందిన పరిశోధకులు వినూత్న పరిశోధన చేపట్టారు. భూమ్మీదే అంగారకుడి తరహా వాతావరణం ఉండే ప్రదేశాలను అన్వేషించి, అంగారకుడిపై జరిపే పరిశోధనలను భూమ్మీదే జరపాలని నిశ్చయించారు. ఈ క్రమంలో ఆ పరిశోధక బృందానికి కోస్టారికా దేశంలోని పావోస్ అగ్నిపర్వత బిలంలో ఏర్పడిన లాగూనా కేలియెంటే సరస్సు దర్శనమిచ్చింది.

భూమ్మీద మానవ మనుగడకు అత్యంత సవాలుగా నిలిచే ప్రదేశాల్లో ఇదొకటి. లావా ఘనీభవించడంతో ఏర్పడిన కఠిన శిలలు ఇక్కడ కనిపిస్తాయి. అత్యంత గాఢతతో కూడిన యాసిడ్ కు ఎంత శక్తి ఉంటుందో, ఈ సరస్సులో నీటికి అంతటి శక్తి ఉంటుంది. ఈ నీటిలో అత్యంత విషపూరితాలైన లోహాలు కరిగి ఉంటాయట. అంతేకాదు, ఇందులోని నీరు తీవ్రమైన వేడితో మరుగుతూ ఉంటుంది. ఇక్కడ అగ్నిపర్వతం ఉన్నందున సరస్సుకు ఎగువ భాగాన ఎప్పటికప్పుడు రాతి పొరలు, ఆవిర్లు, బూడిద పేరుకుపోతుంటాయి.

ఇంతటి క్లిష్టమైన వాతావరణంలోనూ ఒకేఒక్క సూక్ష్మజీవజాలం ఇక్కడ మనుగడ సాగిస్తున్నట్టు 2013లో ఓ అధ్యయనం వెల్లడించింది. దీనిపేరు ఎసిడీఫిల్లమ్. అయితే, ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో అక్కడ కొంత జీవ వైవిధ్యాన్ని గుర్తించారు. ఎసిడీఫిల్లమ్ మాత్రమే కాకుండా, మరికొన్ని రకాల సూక్ష్మజీవ జాతులు కూడా అక్కడ అభివృద్ధి చెందినట్టు తెలుసుకున్నారు.

అయితే అవి కొన్ని జాతులే అయినప్పటికీ, అత్యంత ప్రతికూల, కఠిన పరిస్థితుల్లోనూ అవి అభివృద్ధి చెందడానికి కొన్ని రకాల సహాయకారి అంశాలు అక్కడ ఉన్నాయన్న అంశం రూఢీ అయింది. ఆయా జీవజాతులు ఎలా మనుగడ సాగిస్తున్నాయన్న అంశంపై పరిశోధన చేయగా, ఆసక్తికర అంశం వెల్లడైంది. అగ్నిపర్వతం పేలుడు సంభవించినప్పుడు ఆయా సూక్ష్మజీవులు సరస్సు అంచులను అంటిపెట్టుకుని ఉండడం ద్వారా తమను తాము కాపాడుకున్నాయని భావిస్తున్నట్టు పరిశోధకుడు జస్టిన్ వాంగ్ తెలిపారు. అందుకు వాటిలోని విస్తృతమైన జన్యువులు కూడా తోడ్పడి ఉండొచ్చని పేర్కొన్నారు.

ఈ పరిశోధన ఆధారంగా, భూమ్మీద ఉండే జీవం అంగారకుడిపై ఎలా మనుగడ సాగిస్తుందన్న విషయంలో కొద్దిమేర స్పష్టత వచ్చిందని వారు తెలిపారు. అంగారకుడిపై ఉన్న జెజెరో బిలం కూడా తాము పరిశోధన చేపట్టిన బిలాన్నే పోలి ఉంటుందని, తమ తాజా అధ్యయనం అంగారకుడిపై భవిష్యత్ పరిశోధనలకు ఉపకరిస్తుందని భావిస్తున్నామని జస్టిన్ వాంగ్ అభిప్రాయపడ్డారు.

More Telugu News