Chinna Jeeyar Swamy: మనిషి మనసులో వ్యాపించే వైరస్ కు వ్యాక్సిన్ కావాలి: చిన్నజీయర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఫిబ్రవరి 2 నుంచి రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు
  • ముచ్చింతల్ ఆశ్రమంలో చిన్నజీయర్ మీడియా సమావేశం
  • సమసమాజం ఏర్పడాలని ఆకాంక్ష
Chinna Jeeyar Swamy opines on inequality

శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల నేపథ్యంలో చిన్నజీయర్ స్వామి ముచ్చింతల్ ఆశ్రమంలో మీడియాతో మాట్లాడారు. కరోనా బాహ్య ప్రపంచంలో ప్రమాదకర వైరస్ అని, కానీ మనుషుల్లోని మనసుల్లో అసమానత అనే మరో వైరస్ అంతకంటే భయంకరంగా వ్యాపిస్తోందని చిన్నజీయర్ ఆందోళన వ్యక్తం చేశారు.

సాటి వ్యక్తిని గౌరవించుకోలేని సమాజంలో ఉన్నామని, ఒకే మతానికి చెందిన వ్యక్తుల మధ్య కూడా పరస్పరం కలిసి ఉండే వాతావరణం లేదని అన్నారు. ఒక కుటుంబంలోని వ్యక్తుల మధ్యే పరస్పర గౌరవం ఉండడంలేదని, సమాజంలో కులాల మధ్య అంతరాలు ఉన్నాయని వివరించారు.

కరోనాను మించిన వైరస్ ఈ అసమానత అని, దీని నివారణకు వ్యాక్సిన్ కావాలి అని చిన్నజీయర్ వ్యాఖ్యానించారు. బయట వచ్చే జబ్బులకే కాదు, మనసులో ఉండే జబ్బులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనేక అంశాల్లో మానవుల మధ్య అంతరాలు ఉంటాయని, అయినప్పటికీ మానవుడు ఒకే సమాజంగా జీవించాలని అభిలషించారు.

శ్రీ రామానుజాచార్యులు వెయ్యేళ్ల కిందటే సమానత అనే వ్యాక్సిన్ అందించారని చిన్నజీయర్ పేర్కొన్నారు. నేటి సమాజంలో విస్తృతంగా ప్రబలిపోయిన అసమానత అనే వైరస్ ను తొలగించేందుకే 1,035 కుండాలతో యజ్ఞం చేస్తున్నామని వెల్లడించారు.

More Telugu News