Hyderabad: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఉందామంటూ వేధింపులు.. సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య

  • మొదటి భర్త కుమారుడు, తన  కుమారుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్
  • సుపారీ గ్యాంగ్‌తో రూ. 5 లక్షలకు ఒప్పందం
  • నిద్రిస్తుండగా రోకలి బండతో మోది హత్య
Wife killed husband with the help of sons

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి అంతమొందించిందో భార్య. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుచానూరుకు చెందిన కంచికట్ల శ్రీనివాస్ (42) అనాథ. జీవనోపాధి కోసం హైదరాబాద్ చేరుకుని ఆటో నడుపుతున్న సమయంలో ఉప్పల్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని వేంపేటకు చెందిన స్వప్నతో పరిచయం అయింది. అది ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

స్వప్నకు ఇది వరకే వివాహమైంది. కుమారుడు రాజ్‌కుమార్ జన్మించిన తర్వాత విడాకులు తీసుకుంది. ఇక, శ్రీనివాస్‌తో మరో కుమారుడు (తరుణ్), కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో శ్రీనివాస్ తన స్నేహితుల సహకారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఉప్పల్, వేంపేటలలో ఇళ్లు నిర్మించాడు.

మరోపక్క, శ్రీనివాస్‌కు ఇటీవల ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమెతో పాటు కలిసి ఉందామంటూ స్వప్నను వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో అతడిని అంతం చేయాలని స్వప్న నిర్ణయించుకుంది.

ఇటీవల కుటుంబ సభ్యులందరూ వేంపేటకు వచ్చారు. ఇదే మంచి తరుణమని భావించిన స్వప్న తన కుమారుడు తరుణ్, మొదటి భర్త ద్వారా జన్మించిన రాజ్‌కుమార్‌తోపాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన తన అక్క కుమారుడు పోశెట్టితో కలిసి శ్రీనివాస్ హత్యకు ప్లాన్ వేసింది. సుపారీ గ్యాంగ్‌తో పని పూర్తి చేయాలని అందరూ కలిసి నిర్ణయించారు. మెదక్, జగిత్యాల జిల్లాలకు చెందిన కొందరితో కలిసి రూ. 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ  నెల 22న ఇంట్లో నిద్రపోతున్న శ్రీనివాస్‌పై రోకలిబండతో దాడిచేసి హత్యచేశారు. అనంతరం అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. అనంతరం పోశెట్టి, రాజ్‌కుమార్ కలిసి శ్రీనివాస్ మృతదేహాన్ని ఓ వాగులో పడేశారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించి ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 73 గ్రాముల బంగారు ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

More Telugu News