Neo Cov: అసలేమిటీ నియో కోవ్ వైరస్... వివరాలు ఇవిగో!

  • దక్షిణాఫ్రికాలో మరో వైరస్
  • గబ్బిలాల్లో వెలుగు చూసిన నియో కోవ్
  • అప్రమత్తం చేసిన వూహాన్ పరిశోధకులు
  • మెర్స్ గా దగ్గరగా ఉన్నట్టు అంచనా
Neo Cov a new virus in the fray

ఓవైపు డెల్టా, ఒమిక్రాన్ విజృంభిస్తున్న తరుణంలో మరో వైరస్ కలవరం కలిగిస్తోంది. ఈ వైరస్ ను శాస్త్రవేత్తలు నియో కోవ్ అని పిలుస్తున్నారు. అంటే కొత్త వైరస్ అని అర్థం. దీన్ని దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో గుర్తించారు. నియో కోవ్ వైరస్ అత్యంత వేగంగా వ్యాపించడమే కాదు, తీవ్రస్థాయిలో మరణాలకు కూడా కారణమవుతుందని చైనాలోని వూహాన్ పరిశోధకులు ప్రపంచదేశాలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు ఓ పరిశోధన పత్రం రూపొందించారు. అయితే ఈ పరిశోధన పత్రం విశ్వసనీయత పరీక్షలకు నిలబడుతుందా? అనేది ఇంకా తేలలేదు.

ఈ నయా వైరస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే... ఇది సార్స్ కోవ్-2 రకానికి చెందినదని ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే, మెర్స్ వైరస్ రకానికి దగ్గరగా కనిపిస్తోందన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. మెర్స్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్ఎస్). ఇది 2012లో తొలిసారిగా వెలుగుచూసింది.

ఇది ప్రధానంగా జంతువుల్లో కనిపిస్తుంది. జంతువుల ద్వారానే మానవులకు వ్యాపిస్తుంది. మెర్స్ కనిపించింది 27 దేశాల్లోనే. 858 మంది చనిపోయారు. మెర్స్ సోకినవారు జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలతో బాధపడతారు. ఇప్పుడు నియో కోవ్ కూడా మెర్స్ దగ్గరి బంధువేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కరోనా రకాల వైరస్ లు ఎక్కువగా జంతువుల్లోనే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా గబ్బిలాలు ఇలాంటి వైరస్ లకు సహజ ఆవాసాలు. అందుకే, నియో కోవ్ కూడా జన్యు ఉత్పరివర్తనాలకు లోనై గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తే పరిస్థితి ఏంటన్నది శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా ఇప్పటివరకు సృష్టించిన విలయం నియో కోవ్ పట్ల కలవరపాటుకు కారణమవుతోంది.

దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఏ) స్పందిస్తూ, మానవాళికి నియో కోవ్ తో ఎంత ముప్పు ఉందన్నదానిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని అభిప్రాయపడింది.

అయితే, ఈ వైరస్ కు సంబంధించి ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న అంశాల్లో కొన్ని ఊహాజనితాలు ఉన్నాయంటున్నారు. ఇది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృత్యువాత పడతారన్నది వాటిలో ఒకటి. నియో కోవ్ మరణాల రేటుపై ఇంతవరకు ఎక్కడా నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం ఇది జంతువుల్లోనే ఉన్నందున, ఇది మానవాళికి వ్యాపించాలంటే ఓ మ్యూటేషన్ తప్పనిసరి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News