Daniil Medvedev: అంపైర్ పై ఆగ్రహం ప్రదర్శించిన రష్యా టెన్నిస్ ఆటగాడికి జరిమానా

  • నిన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెమీఫైనల్
  • సిట్సిపాస్ తో తలపడిన మెద్వెదెవ్
  • మ్యాచ్ మధ్యలో అంపైర్ తో వాగ్వాదం
  • రూ.9 లక్షల జరిమానా వడ్డించిన టోర్నీ నిర్వాహకులు
Australian Open organizers fined Daniil Medvedev

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో నిన్న జరిగిన సెమీఫైనల్లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ మ్యాచ్ మధ్యలో అంపైర్ పై వీరంగం వేశాడు. ప్రత్యర్థి ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్ కు గ్యాలరీలో కూర్చున్న అతడి తండ్రి సలహాలు ఇస్తున్నాడని మెద్వెదెవ్ ఆరోపించాడు. నీకది కనిపించడంలేదా? నువ్వు మూర్ఖుడివా? అంటూ అంపైర్ పై అంతెత్తున ఎగిరిపడ్డాడు. అయితే ఆ రష్యా టెన్నిస్ ఆటగాడు అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు.

మెద్వెదెవ్ పై టోర్నీ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. అంపైర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు రూ.9 లక్షల జరిమానా వడ్డించారు. ఇందులో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకున్నందుకు రూ.6 లక్షలు, అభ్యంతరకర పదజాలం వాడినందుకు మరో రూ.3 లక్షలు జరిమానా వేశారు.

కాగా, మెద్వెదెవ్ నిన్న జరిగిన సెమీస్ సమరంలో గెలిచి ఫైనల్ చేరాడు. ఫైనల్లో స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ తో తలపడనున్నాడు. టైటిల్ సమరంలో ఓడినా మెద్వెదెవ్ కు రన్నరప్ కింద రూ.8 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఆ లెక్కన చూస్తే టోర్నీ నిర్వాహకులు విధించిన జరిమానా మెద్వెదెవ్ కు ఏమంత పెద్దది కాదు.

More Telugu News