కోహ్లీ విషయంలో రవిశాస్త్రి వ్యాఖ్యలను తప్పుబట్టిన సంజయ్ మంజ్రేకర్

28-01-2022 Fri 22:06
  • టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ
  • కొందరు అతడిపై ఒత్తిడి తెచ్చారన్న రవిశాస్త్రి
  • శాస్త్రి వ్యాఖ్యలు భారత క్రికెట్ కు మేలు చేయవన్న మంజ్రేకర్
Sanjay Manjrekar reacts to Ravishastri remarks over Kohli issue
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై ఇంకా ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. కోహ్లీ భవిష్యత్ లో సాధించబోయే విజయాలను ఓర్వలేకే కొందరు అతడి రాజీనామాకు కారకులయ్యారని మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు.

రవిశాస్త్రి స్థాయి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు రావడం బాగాలేదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి నాయకత్వంలో తాను కూడా ఆడినవాడ్నే అని, అయితే, ఆయన ఇప్పుడు 2.0 వెర్షన్ లో కొత్తగా అనిపిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

రవిశాస్త్రి వ్యాఖ్యలు చూస్తుంటే ఏమంత తెలివితేటలతో చేస్తున్నవిగా కనిపించడంలేదని, కానీ ఆయన వ్యాఖ్యల వెనుకున్న ఉద్దేశం అందరికీ తెలుసని మంజ్రేకర్ పేర్కొన్నాడు. రవిశాస్త్రిని అగౌరవపరచాలన్నది తన ఉద్దేశం కాదని, కానీ ఆయన వ్యాఖ్యలు భారత క్రికెట్ కు ఏమాత్రం మేలు చేసేవి కావని స్పష్టం చేశాడు.