BrahMos: బ్రహ్మోస్ క్షిపణులకు అంతర్జాతీయ గిరాకీ... భారత్ తో ఫిలిప్పీన్స్ భారీ డీల్

  • బ్రహ్మోస్ ను అభివృద్ధి చేసిన భారత్, రష్యా
  • ప్రత్యేకంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు
  • భారత్ తో ఫిలిప్పీన్స్ 375 మిలియన్ డాలర్ల ఒప్పందం
Philippines inked deal with India for supersonic BrahMos

భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులపై ప్రపంచదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ధ్వనివేగాన్ని మించి దూసుకుపోయే ఈ అత్యాధునిక అస్త్రాలను భూతల, గగనతల, సముద్ర తలాల పైనుంచి ప్రయోగించే వీలుంది. తాజాగా, భారత్ నుంచి బ్రహ్మోస్ (యాంటీ షిప్) క్షిపణుల కొనుగోలుకు ఆసియా దేశం ఫిలిప్పీన్స్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

ఫిలిప్పీన్స్ లో భారత రాయబారి శంభు కుమరన్ సమక్షంలో మనీలాలో జరిగిన ఈ ఒప్పందంపై ఫిలిప్పీన్స్ రక్షణశాఖ మంత్రి డెల్ఫిన్ లొరెంజానా, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జనరల్ అతుల్ దినకర్ రాణే సంతకాలు చేశారు. కాగా, ఈ ఒప్పందం విలువ రూ.2,815 కోట్లు. ఒప్పందం ప్రకారం ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ నావికాదళ వెర్షన్ క్షిపణులను సరఫరా చేయాల్సి ఉంటుంది.

ఒప్పందంలో భాగంగా మూడు బ్యాటరీలు (ఒక్కో బ్యాటరీలో రెండు మిస్సైల్ లాంచర్లు, రాడార్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. ఇది 10 సెకన్ల వ్యవధిలో రెండు మిస్సైళ్లను సంధించగలదు) అందజేయాల్సి ఉంటుంది. దాంతోపాటే ఫిలిప్పీన్స్ నేవీ సిబ్బందికి బ్రహ్మోస్ క్షిపణి పరిజ్ఞానంపై శిక్షణ, నిర్వహణ, ఇతర వస్తు సరంజామా అందించాల్సి ఉంటుంది.

చైనా నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో బ్రహ్మోస్ తమకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుందని ఫిలిప్పీన్స్ భావిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోకి తరచుగా డ్రాగన్ తన యుద్ధ నౌకలను పంపుతూ చిన్నదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు బ్రహ్మోస్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైళ్లతో చైనాకు అడ్డుకట్ట పడుతుందని ఆసియా రక్షణరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News