Android: ఈ ఆండ్రాయిడ్ ‘బ్యాంకింగ్’ మాల్వేర్ మహా డేంజర్.. సమస్త సమాచారం, బ్యాంకు వివరాలు లూటీ!

  • మళ్లీ కోరలు చాస్తున్న ‘బ్రాటా’
  • 2019లో బ్రెజిల్ ను వణికించిన మాల్వేర్
  • క్లీఫీ స్టడీతో మళ్లీ ఇప్పుడు వెలుగులోకి
  • బ్రాటాలో మూడు రకాలున్నాయని హెచ్చరిక
New Android Banking Malware Hits Again Looting Banking Details

అప్పుడెప్పుడో 2019లో ‘బ్యాంకింగ్’ మాల్వేర్ కలకలం సృష్టించింది. కాస్పర్ స్కీ తొలుత దానిని గుర్తించింది. అప్పట్లో బ్రెజిల్ కేంద్రంగా అందరి డేటాను దుండగులు కొల్లగొట్టారు. ఆ తర్వాత అది మాయమైంది. మళ్లీ ఇన్నాళ్లకు తాజాగా అది కోరలు చాచింది.

ఆన్ లైన్ బ్యాంకుల లాగిన్ వివరాలతో పాటు ఫోన్ లో ఉన్న సమస్త సమాచారాన్ని లూటీ చేసేందుకు సిద్ధమైపోయింది. ఆ మహా డేంజర్ ఆండ్రాయిడ్ మాల్వేర్ పేరు ‘బ్రాటా’. గత ఏడాది డిసెంబర్ లో పలువురి బ్యాంకు వివరాలు చోరీ కావడం, వారి ఫోన్లలోని డేటా మొత్తం పోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ క్లీఫీ అధ్యయనంలో ఈ విషయం తేలింది.

ప్రస్తుతం బ్రిటన్, పోలండ్, ఇటలీ, స్పెయిన్, చైనా, లాటిన్ అమెరికా దేశాల్లోని నెట్ బ్యాంకింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బ్రాటాతో దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ నోటిఫికేషన్లు, గూగుల్ ప్లే, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్ లు, కాల్స్ ద్వారా ఈ బ్రాటా మాల్వేర్ ను యూజర్ల ఫోన్లలోకి జొప్పిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

డౌన్ లోడర్ ద్వారా ఫోన్లలోకి ఎక్కిస్తున్న ఈ వైరస్ ను యాంటీ వైరస్ లు కూడా అడ్డుకోలేకపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని దాటుకుని డేటా మొత్తాన్ని చోరీ చేస్తున్నట్టు తేల్చారు. ప్రస్తుతం ఈ బ్యాంకింగ్ మాల్వేర్ లోనే మూడు రకాలున్నాయంటున్నారు. బ్రాటా.ఏ, బ్రాటా.బీ, బ్రాటా.సీగా వాటిని పిలుస్తున్నారు. కొన్ని నెలలుగా బ్రాటా.ఏనే ఎక్కువగా వ్యాప్తిలో ఉందని, దాంట్లోని జీపీఎస్ ట్రాకింగ్ ఫీచర్ తో ఫోన్ ను ఫ్యాక్టరీ రీసెట్ కొట్టవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఇక, బ్రాటా.బీలోనూ అలాంటి ఫీచర్లే ఉన్నాయంటున్నారు. మొదటి రకంతో పోలిస్తే మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. వివిధ బ్యాంకులకు వివిధ రకాల కోడ్ లు, పేజీలతో బ్యాంకుల లాగిన్ వివరాలను బ్రాటా.బీ తస్కరిస్తుందని తేల్చారు. ఇక, బ్రాటా.సీ విషయానికొస్తే.. స్మార్ట్ ఫోన్లలో మాల్వేర్ ను జొప్పించడానికి దీనిని వాడుతున్నట్టు చెబుతున్నారు. బాధితులు ముందుగా డౌన్ లోడ్ చేసుకున్న మాల్వేర్ యాప్ ద్వారా.. సెకండరీ యాప్ ను డౌన్ లోడ్ చేయించి డేటా అంతా చోరీ చేస్తున్నారు. కాబట్టి దానితో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

More Telugu News