India: భారత్-రష్యా ‘డీల్’ పట్ల మరోసారి అమెరికా అక్కసు.. మిసైల్ రక్షణ వ్యవస్థ కొనుగోలుపై ఆందోళన

  • రష్యా అస్థిరత యత్నాలకు నిదర్శనం
  • కొనుగోళ్లతో భారత్ పై ఆంక్షలకు అవకాశం
  • ఈ విషయమై సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం
  • అమెరికా విదేశాంగ శాఖ
Indias S400 Missile Deal Shines Spotlight On Russias Destabilising Role

రష్యా నుంచి భారత్ మిసైళ్ల రక్షణ వ్యవస్థ కొనుగోళ్ల పట్ల అమెరికా మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యా భారత్ కు ఎస్-400 మిసైళ్ల రక్షణ వ్యవస్థను విక్రయించడం.. ఆ దేశ అస్థిరపరిచే పాత్రను తెలియజేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

‘‘ఎస్-400 వ్యవస్థ పట్ల మా ఆందోళనలను ఇది ఏ మాత్రం మార్చలేదు. రష్యా ప్రాంతీయంగానే కాకుండా అంతకుమించి ఇతర ప్రాంతాల్లోనూ  పోషిస్తున్న అస్థిరపరిచే పాత్రను ఇది తెలియజేస్తోంది. ఎస్-400 మిసైళ్ల రక్షణ వ్యవస్థ కొనుగోలు లావాదేవీతో ‘కాట్సా’ పరిధిలో ఆంక్షల రిస్క్ గురించి మేము భారత సర్కారుతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం’’ అని ప్రైజ్ చెప్పారు.

అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, రష్యా నుంచి మిసైళ్ల రక్షణ వ్యవస్థ కొనుగోళ్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. తమ దేశ రక్షణ ప్రయోజనాల కోసమే ఈ డీల్ అని పేర్కొంది. దీనిపై మీడియా నుంచి ప్రైజ్ ఒక ప్రశ్న ఎదుర్కొన్నారు. రష్యా నుంచి ఎస్-400 భారత్ కొనుగోలు చేయడం.. న్యూఢిల్లీతో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపిస్తుందా? అని ఒకరు ప్రశ్నించారు.

‘‘భారత్ కావచ్చు. మరో దేశమైనా కావచ్చు. రష్యాతో ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు సంబంధించి ఎటువంటి భారీ ఒప్పందాలను కుదుర్చుకోకూడదన్నదే మా వినతి’’ అని ప్రైజ్ చెప్పారు. శత్రుదేశం క్షిపణులను ప్రయోగిస్తే వాటిని గాల్లోనే ధ్వంసం చేసేదే ఎస్-400 మిసైళ్ల రక్షణ వ్యవస్థ. ఈ తరహా ఆధునిక ఆయుధ సంపత్తి అమెరికా, చైనా వద్ద కూడా ఉంది. భారత్ కు మాత్రం ఉండకూడదన్నది అమెరికా కుచ్చిత బుద్ధికి నిదర్శనం.

More Telugu News