MS Dhoni: చెన్నైకు చేరుకున్న ధోనీ.. మెగా వేలంలో ఆటగాళ్ల కొనుగోళ్లపై కసరత్తు! 

  • విమానాశ్రయం నుంచి హోటల్ కు
  • ఆటగాళ్ల కొనుగోలు వ్యూహంపై దృష్టి
  • ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరులో వేలం
MS Dhoni arrives in Chennai weeks ahead of mega auction

ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలానికి రెండు వారాల ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చేరుకున్నాడు. గురువారం చెన్నై విమానాశ్రయంలో దిగిన ఆయన నేరుగా ఓ హోటల్ కు వెళ్లిపోయాడు.

ఐపీఎల్ లో ఈ ఏడాది నుంచి రెండు జట్లు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, అహ్మదాబాద్ జట్లకు ఐపీఎల్ పాలక మండలి చోటు కల్పించింది. దీంతో ప్రస్తుత ఎనిమిది జట్లు గరిష్ఠంగా నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకుని మిగిలిన వారిని విడుదల చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం జరగనుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నలుగురిని అట్టి పెట్టుకుంది. అందులో ధోనీతోపాటు జడేజా, మోయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. ఇది పోను ఆటగాళ్ల కొనుగోలుకు రూ.58 కోట్లు మిగిలి ఉన్నాయి. దీంతో వేలంలో మంచి ఆటగాళ్లను సొంతం చేసుకోవడంపై ధోనీ, సీఎస్కే యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించనుంది. ఆ కసరత్తులో భాగంగానే ధోనీ చెన్నై చేరుకున్నాడని తెలుస్తోంది.

సీఎస్కే జట్టు నిర్మాణంలో, ఆటగాళ్ల కొనుగోళ్లలో ధోనీ ముఖ్య పాత్ర పోషిస్తుంటాడన్నది తెలిసిందే. ‘‘వచ్చే పదేళ్ల పాటు పనిచేసే వారితో జట్టును నిర్మించాల్సి ఉంది. అంతేకానీ సీఎస్కేకు నేను ఆడతానన్నది ముఖ్యం కాదు. సీఎస్కేకు ఏది ముఖ్యమైతే అదే చేయాలి’’అంటూ ధోనీ లోగడే ప్రకటించాడు.

More Telugu News