NTR District: తెలుగు తేజంకు ఘన నివాళిగా 'ఎన్టీఆర్ జిల్లా'.. వైసీపీకి రాజకీయంగా లాభిస్తుందా?

Do YSRCP gets benefit out of NTR district formantion
  • ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ప్రకటించిన జగన్
  • ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేస్తానని పాదయాత్ర సమయంలో హామీ
  • జిల్లా ఏర్పాటుపై మౌనంగా ఉన్న టీడీపీ
  • ఇంత వరకు స్పందించని జూనియర్ ఎన్టీఆర్
  • జిల్లా ఏర్పాటును స్వాగతించిన పురందేశ్వరి

తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ఒక కీలకమైన హామీని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిలుపుకున్నారు. కృష్ణా జిల్లాలో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే జిల్లాకు దివంగత ఎన్టీఆర్ పేరు పెడతానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి ఆత్మగౌరవమని, అందరి వ్యక్తి అని ఆ సమయంలో ఆయన చెప్పారు. చెప్పిన విధంగానే జగన్ తాను ఇచ్చిన హామీని నిలుపుకున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కృష్ణా జిల్లా రెండు జిల్లాలుగా అవతరిస్తోంది. ఇందులో విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. తద్వారా జగన్ తన హామీని నిలుపుకోవడమే కాకుండా... దివంగత ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించినట్టయింది.

మరోవైపు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. గత టీడీపీ హయాంలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ జరిగింది. లోక్ సభ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఎందుకొచ్చిన అనవసరమైన తలనొప్పులు అనుకున్నారో ఏమో కానీ... చివరి వరకు ఈ అంశాన్ని ఆయన టచ్ చేయలేదు.

ఇప్పుడు కొత్త జిల్లాలకు జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 26 జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, ఎన్టీఆర్ జిల్లాను జగన్ ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు మౌనంగా ఉన్నాయి. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎవరూ స్పందించలేదు.

'ఎన్టీఆర్ జిల్లా'కు అనుకూలంగా స్పందిస్తే జగన్ ను సమర్థించినట్టవుతుంది. వ్యతిరేకిస్తే పార్టీలో ఓ వర్గం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దీంతో, అందరూ సైలెంట్ గా ఉన్నారు. ప్రజలలో ఎంతో ఆదరణ వున్న నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇప్పటి వరకు మౌనంగా ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి మాత్రం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఎన్టీఆర్ జిల్లాను స్వాగతిస్తున్నట్టు తెలిపారు.

మరోవైపు, తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ ను మట్టికరిపించిన తిరుగులేని నేతగా ఎన్టీఆర్ కు గుర్తింపు ఉంది. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆయనను పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా చేయలేని పనిని జగన్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల... రాబోయే రోజుల్లో రాజకీయంగా వైసీపీకి ఎంత మేర ప్రయోజనం చేకూరుతుందన్నది వేచి చూడాలి!

  • Loading...

More Telugu News