ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఓ దారికి వచ్చినట్టే!

25-01-2022 Tue 18:16
  • కొరటాల ప్రాజెక్టు పైకి ఎన్టీఆర్ 
  • త్వరలో మొదలుకానున్న షూటింగ్
  • వెనక్కి వెళ్లిన అట్లీకుమార్ ప్రాజెక్టు 
  • ముందుకు వచ్చిన బుచ్చిబాబు సినిమా  
Ntr in Buchhi Babu movie
క్రితం ఏడాది థియేటర్లలో సందడి చేసిన సినిమాలలో 'ఉప్పెన' ఒకటి. వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా ఇది ఆయనకి ఫస్టు మూవీ. కొత్త హీరో హీరోయిన్లతో ఆయన తెరకెక్కించిన ఈ సినిమా, కథాకథనాల పరంగా .. పాటల పరంగా యూత్ ను ఒక ఊపు ఊపేసింది. రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టేసింది.

ఆ తరువాత సినిమాను ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కథ నచ్చడం వలన ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకున్నారు. సుకుమార్ కి బుచ్చిబాబు ప్రియ శిష్యుడు కనుక, ఎన్టీఆర్ నుంచి ఓకే అనిపించుకోవడం తేలికే అయింది. అయితే కొరటాల .. అట్లీ కుమార్ ప్రాజెక్టులను పూర్తిచేసిన తరువాతనే ఎన్టీఆర్ ఈ సినిమా పట్టాలెక్కించాలనుకున్నాడు.

అయితే ప్రస్తుతం బోయపాటితో ఒక సినిమా చేయనున్న బన్నీ .. ఆ తరువాత సినిమాను అట్లీ కుమార్ తో చేయనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ లో ఈ సినిమా నిర్మితం కానుంది. బన్నీతో అట్లీ కుమార్ ముందుకు వెళుతున్నాడు కనుక, కొరటాల తరువాత సినిమాను బుచ్చిబాబుతో చేసేయాలనే నిర్ణయానికి ఎన్టీఆర్ట్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.