సోము వీర్రాజు, ఇతర నాయకుల అరెస్ట్ ను ఖండిస్తున్నా: జీవీఎల్ నరసింహారావు

25-01-2022 Tue 15:50
  • సంక్రాంతి వేడుకలకు గుడివాడ వెళ్తుండగా అరెస్ట్ చేశారు
  • కొందరు ఐపీఎస్ లు వైపీఎస్ లుగా వ్యవహరిస్తున్నారు
  • ఏపీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు బీజేపీ పోరాటం చేస్తుంది
GVL Narasimna Rao condemns Somu Veerraju arrest
గుడివాడలో కేసినో నిర్వహించడం, అమ్మాయిలతో అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించడం వంటి ఘటనలను నిరసిస్తూ బీజేపీ నేతలు విజయవాడ నుంచి గుడివాడకు పాదయాత్రగా బయల్దేరిన సంగతి తెలిసిందే. అయితే వీరిని నందమూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టులను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఇతర నేతలు సంక్రాంతి వేడుకల కోసం గుడివాడకు వెళ్తుండగా వారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని జీవీఎల్ అన్నారు. రాష్ట్రంలోని కొందరు ఐపీఎస్ అధికారులు వైపీఎస్ (వైసీపీ పోలీస్ సర్వీస్) అధికారుల మాదిరి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.