సంక్షిప్త వార్తలు ఇవిగో!

22-01-2022 Sat 22:11
  • ఏపీలో తీవ్రస్థాయిలో కరోనా వ్యాప్తి
  • తిరుపతి ఐఐటీలో 75 మందికి పాజిటివ్
  • మహారాష్ట్రలో ఒక్కరోజులో 46 వేలకు పైగా కొత్త కేసులు
  • మలుపు తిరిగిన ఒంగోలు హత్యాయత్నం వ్యవహారం
News roundup
*  ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. తాజాగా తిరుపతి ఐఐటీలోనూ కరోనా కలకలం చెలరేగింది. ఐఐటీ క్యాంపస్ లో 75 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో అధికారులు ఐఐటీ ప్రాంగణంలోని హాస్టల్ నే కొవిడ్ కేంద్రంగా మార్చారు.

*  మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 46,353 కరోనా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 48 మంది మృత్యువాత పడ్డారు.

*  ఓటర్లను ప్రలోభపెట్టే పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ఈసీని ప్రతివాదులుగా చేర్చాలని కోర్టును కోరారు. 'ఉచితం' హామీలు నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత ఎన్నికలకు విఘాతమని పేర్కొన్నారు. ఉచితాలు ఓ రకంగా లంచం కిందకే వస్తాయని అశ్వినీ ఉపాధ్యాయ వివరించారు.

*  ఒంగోలులో యువకుడిపై దాడి కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఇది వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిందని భావిస్తుండడం తెలిసిందే. షేక్ రబ్బానీ అనే వ్యక్తి కాశీరావు అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు. అయితే రబ్బానీ ఈ దాడికి ముందు నెల్లూరులో జంట హత్యలు చేశాడని పోలీసులు గుర్తించారు.

*  కలిగిరి మండలం అంబటివారి పాలెంలో ఉదయం జంట హత్యలు జరిగాయి. మీరమ్మ అనే మహిళను, ఆమె కుమారుడు అలీఫ్ ను రబ్బానీ అంతమొందించాడు. ఈ హత్యల తర్వాత ఒంగోలు వచ్చిన రబ్బానీ... రవిప్రియా మాల్ సమీపంలో కాశీరావుపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాశీరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కలిగిరిలో హత్యకు గురైన మీరమ్మ... కాశీరావుకు వదిన అవుతుంది. వీరిద్దరిపై రబ్బానీ కొంతకాలంగా కక్ష పెంచుకున్నట్టు వెల్లడైంది.