మంత్రి బాలినేనికి, సజ్జలకు నెల కిందటే మా డిమాండ్లు చెప్పాం: ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్

22-01-2022 Sat 21:30
  • కడపలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సదస్సు
  • ప్రభుత్వంపై జేఏసీ చైర్మన్ అసంతృప్తి
  • తమ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యాఖ్య   
  • ఎన్జీవోల ఉద్యమానికి మద్దతిస్తున్నట్టు ప్రకటన
AP Electricity Employees JAC Chairman Chandrasekhar raise his voice
కడపలో ఏపీ రాష్ట్రస్థాయి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తోందంటూ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తమ డిమాండ్లను నెల కిందటే చెప్పామని అన్నారు.

ట్రాన్స్ కో సీఎండీ, ఇంధన శాఖ కార్యదర్శికి రెండు పదవులు సరికాదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ థర్మల్ ప్లాంట్లను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కృష్ణపట్నం ప్లాంటు ప్రైవేటుపరం చేసే నిర్ణయం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.

ఎన్జీవోల ఉద్యమానికి విద్యుత్ ఉద్యోగులు మద్దతు తెలుపుతున్నారని చంద్రశేఖర్ ప్రకటించారు. తమ డిమాండ్లపై సోమవారం నాడు యాజమాన్యానికి వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు.