సినీ తారల శవాలను సల్మాన్ ఖాన్ ఫాంహౌస్ లో పాతిపెడుతున్నారంటూ పొరుగు వ్యక్తి ఆరోపణలు

22-01-2022 Sat 21:10
  • పన్వేల్ లో సల్మాన్ కు ఫాంహౌస్
  • పొరుగునే కేతన్ కక్కడ్ అనే వ్యక్తి భూమి
  • నిలిచిపోయిన ఓ భూమి కొనుగోలు లావాదేవీ
  • సల్మానే కారకుడంటూ కక్కడ్ ఆరోపణ
  • పరువునష్టం దావా వేసిన సల్మాన్
Ketan Kakkd sensational allegations on Salman Khan
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు పన్వేల్ వద్ద ఓ భారీ వ్యవసాయ క్షేత్రం ఉంది. ఈ ఫాంహౌస్ కు పొరుగునే కేతన్ కక్కడ్ అనే వ్యక్తికి సంబంధించిన భూమి ఉంది. ఇటీవల కేతన్ కక్కడ్ ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశాడంటూ సల్మాన్ ఖాన్ కోర్టుకెక్కడం తెలిసిందే. కేతన్ కక్కడ్ పై పరువునష్టం దావా వేశాడు.

దీనిపై ముంబయి కోర్టులో విచారణ సందర్భంగా సల్మాన్ తరఫు న్యాయవాది ప్రదీప్ గాంధీ వాదనలు వినిపించారు. సల్మాన్ ఖాన్ కు చెందిన పన్వేల్ ఫాంహౌస్ లో సినీ తారల శవాలను పాతిపెడుతున్నారంటూ కేతన్ కక్కడ్ అసత్య ఆరోపణలు చేశాడని ప్రదీప్ గాంధీ కోర్టుకు వివరించారు. అంతేకాదు, సల్మాన్ ఖాన్ మతాన్ని కూడా వివాదంలోకి లాగాడని, బాలల అక్రమరవాణా ఆరోపణలు కూడా చేశాడని తెలిపారు.

ఈ ఆరోపణలన్నీ కల్పితాలని సల్మాన్ తన న్యాయవాది ద్వారా కోర్టుకు తెలియజేశాడు. తన తల్లి హిందువు అని, తండ్రి ముస్లిం అని సల్మాన్ పేర్కొన్నాడు. తన సోదరులు హిందువులనే పెళ్లాడారని, తమ కుటుంబంలో అన్ని పండుగలు జరుపుకుంటామని వివరించాడు. ఇదంతా ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారమని, ఇందులో మతం ప్రస్తావన ఎందుకని సల్మాన్ ప్రశ్నించాడు. ఎందుకు తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని నిలదీశాడు.

కాగా, సల్మాన్ ఖాన్ తన పరువునష్టం దావాలో గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ల పేర్లను కూడా పేర్కొన్నాడు. ఆయా సామాజిక మాధ్యమాలు కేతన్ కక్కడ్ ఇంటర్వ్యూ వీడియోలను తొలగించాలని సల్మాన్ కోరుతున్నాడు.

అయితే, కేతన్ కక్కడ్ ఇకపై సల్మాన్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలంటూ సల్మాన్ న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. సల్మాన్ దావాపై బదులిచ్చేందుకు తగినంత సమయం కావాలని అటు కేతన్ కక్కడ్ న్యాయవాదులు కోర్టును కోరారు.

పన్వేల్ లో సల్మాన్ ఖాన్ ఫాంహౌస్ కు పక్కనే ఉన్న భూమిని కేతన్ కక్కడ్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ లావాదేవీని అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో కేతన్ కక్కడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సల్మాన్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. భూమి కొనుగోలు వ్యవహారం నిలిచిపోవడానికి సల్మాన్ ఖానే కారకుడని మండిపడ్డాడు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని సల్మాన్ ఖాన్ న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.