Tamilnadu: డ్యాన్స్ చేస్తూ పెళ్లి మండపంలోకి వచ్చిన పెళ్లికూతురు.. చెంపచెళ్లుమనిపించిన వరుడు.. వరుడినే మార్చేసిన వధువు!

  • తమిళనాడులోని కదంపులియూర్ లో ఘటన
  • పెళ్లి కూతురు కుటుంబమే అవమానించిందన్న వరుడు
  • స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • పెళ్లికి పెట్టిన రూ.7 లక్షలు ఇప్పించాలని వేడుకోలు
Bride Calls Off Wedding After Groom Slapped Her for dancing

పెళ్లంటే నూరేళ్ల పంట అంటూ ఉంటారు. ఓ జంట విషయంలో మాత్రం నూరేళ్లు కాదు కదా.. తాళి కట్టే వరకు కూడా ఆ పెళ్లి పండలేదు. పైగా రెండు కుటుంబాల మధ్య మంట పెట్టింది. పోలీస్ స్టేషన్లలో పోటాపోటీ కేసులు పెట్టుకునే దాకా తీసుకెళ్లింది. ఈ ఘటన తమిళనాడులోని కదంపులియూర్ లో జరిగింది.

పన్రుతికి చెందిన సీనియర్ ఇంజనీర్ కు, అదే ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త కూతురితో గత ఏడాది నవంబర్ 16న ఎంగేజ్ మెంట్ అయింది. జనవరి 19న రిసెప్షన్, 20న పెళ్లి పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే జనవరి 19న పెట్టుకున్న రిసెప్షన్ లో మండపానికి నవ వధువు డ్యాన్స్ చేసుకుంటూ వచ్చింది. ఆమెతో పాటు వరుడూ కాలు కదిపాడు. కానీ, ఇంతలోనే ఆమెకు బావ వరుసయ్యే వ్యక్తి కూడా వారికి తోడయ్యాడు.

అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే కథ మారింది. ఆ బావ వరుసయ్యే వ్యక్తి ఇద్దరి మధ్యలోకి దూరి వారి భుజాలపై చేతులేసి డ్యాన్స్ చేశాడు. దిమ్మతిరిగిపోయిన వరుడు.. అతడిని తోసేసి.. వధువు చెంప మీద ఒక్కటిచ్చాడు. ఆమె కూడా అదే రేంజ్ లో వరుడి చెంప చెళ్లుమనింపించింది. పెళ్లిని క్యాన్సిల్ చేసేసుకుంది.

ఆమె నిర్ణయాన్ని గౌరవించిన పెళ్లికూతురు తండ్రి.. పెళ్లిని రద్దు చేసేశాడు. పెళ్లికాకముందే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక ఇంకెలా ఉంటాడోనన్న భయంతోనే ఈ పెళ్లిని రద్దు చేసుకున్నామని చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ పెళ్లికి వచ్చిన వారిలో బావ వరుసయ్యే మరో వ్యక్తికిచ్చి అదే ముహూర్తానికి వేరే వేదికలో పెళ్లి చేశారు.

అయితే, దీనిపై సదరు వరుడు మరో వాదనను వినిపించాడు. ముందు వాళ్లే తనను వేధించారని ఆరోపించాడు. పన్రుతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వారే తనపై ఎన్నెన్నో అభాండాలు వేశారని పేర్కొన్నాడు. తాము పెళ్లి కోసం రూ.7 లక్షల దాకా ఖర్చు పెట్టామని, ఆ డబ్బును తిరిగిప్పించాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశాడు. ఇటు పెళ్లి కూతురును కొట్టాడని అతడిపైనా అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టారు.

More Telugu News