RTC: సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొంటారు: ఉద్యోగ సంఘాల నేతల స్పష్టీకరణ

  • మెరుగైన పీఆర్సీ కావాలంటున్న ఉద్యోగులు
  • ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై అసంతృప్తి
  • ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె
  • అన్ని ఉద్యోగ సంఘాలు పాల్గొంటాయన్న నేతలు
Employees union leaders says RTC staff also participates in strike

పీఆర్సీ సాధన కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన ఏపీ ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించడం తెలిసిందే. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని స్పష్టం చేశారు. కార్యాచరణ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శిగా ఆర్టీసీ కార్మిక సంఘం ఈయూ అధ్యక్షుడు వైవీ రావు ఉన్నారని, ఆర్టీసీ సమ్మెలో పాల్గొనడంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని అన్నారు.  శాంతియుత పద్ధతుల్లోనే ఉద్యమం కొనసాగుతుందని నేతలు వెల్లడించారు.

ఉద్యోగులు అసభ్యంగా మాట్లాడుతున్నారని, అసభ్య వ్యాఖ్యలు చేస్తే హెచ్ఆర్ఏ పెరుగుతుందా? అని మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేయడంపై వారు స్పందించారు. ఉద్యోగులు ఎవరూ అసభ్య వ్యాఖ్యలు చేయొద్దని, శాంతియుతంగా ఉద్యమం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని ఉద్యోగులను కోరుతున్నామని స్పష్టం చేశారు.

ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, 4 జేఏసీలు కలిసి పీఆర్సీ సాధన కమిటీగా ఏర్పడినట్టు వెల్లడించారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 23న ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయని అన్నారు. ఈ నెల 24న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇస్తామని పేర్కొన్నారు.

కొత్త జీతాలు అన్యాయంగా ఉన్నాయని, చర్చలు పూర్తయ్యేవరకు పాత పద్ధతిలోనే జీతాలు ఇవ్వాలని కోరుతున్నామని, తమ డిమాండ్లలో న్యాయం, ధర్మం ఉన్నాయని వివరించారు. పీఆర్సీ నివేదికను పూర్తిగా బహిర్గతం చేయాలని, దానిపై మరలా చర్చలు జరపాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

More Telugu News