50 సంవత్సరాల తర్వాత ఈ యాగం నిర్వహించే అదృష్టం నాకు దక్కింది: వైవీ సుబ్బారెడ్డి

21-01-2022 Fri 15:55
  • తిరుచానూరులో నవకుండాత్మక శ్రీయాగం
  • అర్ధశతాబ్దం తర్వాత మళ్లీ యాగం
  • ప్రపంచ శాంతి కోరుతూ యాగం
  • ఈ ఉదయం అంకురార్పణ
  • సతీసమేతంగా హాజరైన వైవీ
  • అమ్మవారికి 34 గ్రాముల హారం బహూకరణ
YV Subbareddy attends Navakundathmaka Sree Yagam in Tiruchanur
అర్ధ శతాబ్దం తర్వాత తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో నవకుండాత్మక శ్రీయాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగం నేడు ప్రారంభమైంది. ఈ నెల 27 వరకు జరగనుంది. ఈ ఉదయం 9.30 గంటలకు యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

ఈ రోజు తిరుచానూరులో నవకుండాత్మక శ్రీయాగం వేడుకగా ప్రారంభమైందని వెల్లడించారు. 50 ఏళ్ల తర్వాత ఈ యాగం నిర్వహిస్తున్నారని, తన చేతుల మీదుగా యాగం చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ యాగంలో పాల్గొన్న సందర్భంగా వైవీ దంపతులు పద్మావతి అమ్మవారికి 34 గ్రాముల పసిడి హారాన్ని సమర్పించారు.

నవకుండాత్మక శ్రీయాగాన్ని ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వాల కోసం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో భాగంగా మధ్యాహ్నం 1 గంట వరకు అగ్నిప్రతిష్ఠ, వేద విన్నపం, మహా మంగళహారతి చేపట్టారు. ఈ సాయంత్రం 5 గంటల నుంచి చతుష్టానార్చాన, శ్రీయాగం హోమాలు, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.