fund raising: భారత సంతతి చిన్నారి కోసం సింగపూర్ లో రూ.16.68 కోట్ల విరాళాలు

  • అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ
  • చికిత్స చేయకపోతే ప్రాణగండం
  • 30,000 మంది దాతల పెద్ద మనసు
  • 10 రోజుల్లోనే మొత్తం విరాళాలు
  • చికిత్స తర్వాత చక్కగా నడుస్తున్న చిన్నారి
Rs 16 Crore Raised In Singapore For Treatment Of Indian Origin 2 Year Old

భారత సంతతికి చెందిన రెండేళ్ల చిన్నారి దేవదన్ దేవరాజ్ కోసం సింగపూర్ ప్రజలు మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న దేవదన్ ప్రాణాలతో బయట పడాలంటే ఖర్చు రూ.16 కోట్లకు పైనే అవుతుంది. భారత సంతతికి చెందిన ఉద్యోగి దవే దేవరాజ్, ఆయన భార్య చైనా సంతతికి చెందిన షువెన్ దేవరాజ్ తమ కుమారుడి వైద్య ఖర్చు రూ.16 కోట్లను భరించే స్తోమత లేకపోవడంతో క్రౌడ్ ఫండ్ ప్లాట్ ఫామ్ పై విరాళాలకు పిలుపునిచ్చారు.

దీంతో అందరూ తలా కొంత ఇచ్చిన విరాళంతో 30 లక్షల సింగపూర్ డాలర్లు సమకూరాయి. మన కరెన్సీలో రూ.16.68 కోట్లు. దాంతో జోల్ జెన్ స్మా అనే ఖరీదైన జీన్ థెరపీ సింగిల్ ఇంజెక్షన్ తో దేవదన్ కు నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యులు ప్రాణాలు కాపాడారు. దాంతో వ్యాధి నుంచి అతడు కోలుకున్నాడు. సొంతంగా నడవ గలుగుతున్నాడు.

దీనిపై షువెన్ దేవరాజ్ భావోద్వేగంతో స్పందించారు. ‘‘ఏడాది క్రితం మా కుమారుడు నడుస్తాడని అనుకోలేదు. అప్పుడు అతడు నిలబడడం కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు నడవడమే కాకుండా, మూడు చక్రాల సైకిల్ ను కొంత మేర నడుపుతున్నాడు. ఇది అద్భుతంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

కేవలం 10 రోజుల్లోనే 30,000 మంది దాతల సహకారంతో చికిత్స కోసం కావాల్సినంత సమకూరడం విశేషం. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధిలో కండరాలు చచ్చుపడిపోతాయి. చికిత్స చేయకపోతే మరణిస్తారు. ఇది జన్యుపరమైన వ్యాధి. పుట్టిన ఏడాది నుంచి నాలుగేళ్లలోపు బయటపడుతుంది.

More Telugu News