వచ్చింది ఒమిక్రానా? లేక డెల్టానా..? అన్నది ఇలా స్పష్టంగా తెలుసుకోవచ్చు..! 

19-01-2022 Wed 14:16
  • ఒమిక్రాన్ లక్షణాలు భిన్నం
  • రెండు మూడు రోజుల్లోనే బయటకు
  • తలనొప్పి, కండరాల నొప్పులు, ముక్కు కారడం
  • బలహీనత, గొంతులో మంట, దగ్గు
  • ప్రధాన లక్షణాలు ఇవే
14 Omicron symptoms ranked from most to least prevalent
కరోనా డెల్టా వేరియంట్ అంతమైపోలేదు. ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ వచ్చి వేగంగా వ్యాప్తిస్తున్నా.. డెల్టా వేరియంట్ కూడా మనుగడలోనే ఉంది. ఒమిక్రాన్ రకం పెద్దగా నష్టం చేయడం లేదు కానీ, డెల్టా రకం మాత్రం ప్రమాదకరమైందే. కనుక పాజిటివ్ వచ్చిన వారు తమకు సోకింది ఏ రకమో తెలుసుకునే అవకాశం ఉంది. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. పరీక్ష లేకుండా లక్షణాల ఆధారంగా కూడా గుర్తు పట్టొచ్చు.

ఒమిక్రాన్ లక్షణాలు..

కరోనా ఒమిక్రాన్ రకంలో ఇప్పటి వరకు కనిపించిన లక్షణాలు.. ముక్కు కారటం (73 శాతం కేసుల్లో), తలనొప్పి (68 శాతం కేసుల్లో), అలసట (60 శాతం), తుమ్ములు (60 శాతం), గొంతులో మంట, గరగర (60 శాతం), విడవని దగ్గు (44 శాతం), స్వరం మారడం (36 శాతం), చలి, వణుకు (30 శాతం), జ్వరం (29 శాతం), తల తిరగడం (28 శాతం), అయోమయం (24 శాతం), కండరాల నొప్పులు (23 శాతం), ఛాతిలో నొప్పి (19 శాతం).

ముఖ్యంగా కరోనా మునుపటి వేరియంట్లలో ఆక్సిజన్ శాచురేషన్ పడిపోయి, శ్వాస తీసుకోవడం కష్టమయ్యేది, చాలా మందిలో వాసన, రుచి కోల్పోవడం కనిపించింది. కానీ, ఒమిక్రాన్ కేసుల్లో శ్వాస సమస్య కనిపించడం లేదు. వాసన కోల్పోవడం ఎక్కడో అరుదుగా కనిపిస్తోంది.

సాధారణంగా కరోనా మొదటి రెండు రకాల ఇంక్యుబేషన్ సమయం (శరీరంలోకి వచ్చిన తర్వాత పునరుత్పాదన) 1-14 రోజులుగా ఉండేది. కనీసం ఆరు రోజుల తర్వాత లక్షణాలు కనిపించేవి. కానీ, ఒమిక్రాన్ రకంలో ఎక్కువ మందిలో రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు కనిపిస్తున్నాయి. లక్షణాలు కనిపించిన మొదటి రోజు కాకుండా తర్వాతి రోజు చేయించుకోవడం వల్ల తప్పుడు ఫలితాలకు అవకాశం ఉండదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ పేర్కొన్నారు. పైగా కరోనా పాజిటివ్ నుంచి నెగెటివ్ కు వారం, పది రోజుల్లోనే వచ్చేస్తున్నారు.