'ఆహా' కోసం హోస్టుగా మారుతున్న వెంకీ?

19-01-2022 Wed 11:15
  • బుల్లితెరపై స్టార్ హీరోల సందడి 
  • ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పట్ల కొత్త ఉత్సాహం 
  • 'అన్ స్టాపబుల్'తో అదరగొడుతున్న బాలయ్య 
  • వెంకీని రంగంలోకి దింపే దిశగా ప్రయత్నాలు   
Venkatesh his ready to host the Aha OTT Programme
బాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహరించడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు. ఇక కోలీవుడ్ లోను కమల్ వంటి సీనియర్ స్టార్ హీరోలు కూడా హోస్ట్ గా బుల్లితెరపై సందడి చేస్తున్నారు. తెలుగులో చిరంజీవి .. నాగార్జున .. రానా వంటి వారు హోస్ట్ గా చేసిన కార్యక్రమాలు భారీ రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి.

అయితే మొదటి నుంచి కూడా వెంకటేశ్ ఈ తరహా కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు 'రానా నాయుడు' అనే ఒక వెబ్ సిరీస్ లో చేస్తున్న ఆయన, 'ఆహా' కోసం హోస్టుగా కూడా కనిపించనున్నట్టు తెలుస్తోంది. కొత్త సినిమాలతో .. వెబ్ సిరీస్ లతో కొత్త కాన్సెప్ట్ లతో 'ఆహా' దూసుకెళుతోంది.

 'ఆహా'లో బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' ఇప్పటికే నెంబర్ వన్ గా నిలిచింది. దాంతో కొత్తగా మరో షోను ప్లాన్ చేస్తున్నారు. ఈ షో కోసం హోస్టుగా వెంకటేశ్ ను సంప్రదిస్తున్నారట. ఆయనను ఒప్పించడానికి అల్లు అరవింద్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారని అంటున్నారు. వెంకీని హోస్టుగా చూడాలనే అభిమానుల ముచ్చట ఈ ఏడాది తీరుతుందేమో చూడాలి.