యూపీలో బీజేపీ సైతం ఆకర్షణ మంత్రం.. ప్రతిపక్ష పార్టీ నేతలకు వల

15-01-2022 Sat 10:05
  • ఇప్పటికే చేరిన కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద
  • మరో ఎమ్మెల్యే అదితిసింగ్ కూడా చేరిక 
  • బీఎస్పీ, ఎస్పీ నుంచి ఒక్కో ఎమ్మెల్యే
  • బీజేపీలోకి  ఆకర్షించేందుకు ప్రత్యేక కమిటీ
Akhilesh Turns Master Poacher Bjp Likely To Retain Most Mlas To Arrest Defections
ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ వేస్తున్న ఎత్తులకు బీజేపీ పై ఎత్తులు వేస్తోంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేశ్ యాదవ్ ఆధ్వర్యంలోని ఎస్పీ.. బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆకర్షిస్తూ తాను బలపడే ప్రయత్నం చేస్తోంది. ఫలితంగా బీజేపీ ఏడుగురు నేతలను కోల్పోయింది. కానీ, ఎస్పీ కంటే బీజేపీ రెండు ఆకులే ఎక్కువే చదివినట్టు పరిణామాలు చూస్తే తెలుస్తుంది.

2017 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ సైతం ఇప్పుడు ఎస్పీ మాదిరే నేతలను ఆకర్షించడంపై దృష్టి పెట్టి విజయం సాధించింది. దాన్నే ఇప్పుడు అఖిలేశ్ ఆచరణలో చూపిస్తున్నారు. పైకి పెద్దగా ప్రచారం జరగడం లేదు కానీ, బీజేపీ కూడా ఈ విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తోంది.

బీజేపీ నుంచి మరింత మంది నేతలను ఎస్పీ ఆకర్షించే అవకాశాలు ఇవ్వబోమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్లు ఇస్తామన్న సంకేతాలు పంపించింది. దీంతో వారు టికెట్ల కోసం పక్క పార్టీల వైపు చూడకుండా ఉంటారని భావిస్తోంది. దాదాపు అన్ని ప్రీ పోల్ సర్వేలు యూపీలో అధికారం మరోసారి బీజేపీనే వరిస్తుందని ప్రకటించడం గమనార్హం.

2017 ఎన్నికల ముందు బీఎస్పీ, కాంగ్రెస్ నుంచి పేరున్న నేతలను బీజేపీ ఆకర్షించడం గమనించాలి. ఇప్పుడు పార్టీని వీడిన స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ తదితరులు అప్పుడు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారే.

ఇక ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద, రాయ్ బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ ను బీజేపీ పార్టీలోకి చేర్చుకుంది. ఎస్పీకి చెందిన సైదాపూర్ ఎమ్మెల్యే సుభాష్ పాసి, బీఎస్పీ ఎమ్మెల్యే సాగ్రి వందనసింగ్ ను కూడా ఆకర్షించింది. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత బాజ్ పాయి నేతృత్వంలో ఇతర పార్టీల నుంచి ఆకర్షించేందుకు ఒక కమిటీయే పనిచేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.