వరుణ్ తేజ్ దోశను ఉప్మా చేసేశానన్న చిరంజీవి!

14-01-2022 Fri 15:47
  • భోగి పండుగను సెలబ్రేట్ చేసుకున్న మెగా ఫ్యామిలీ
  • దోశలు వేసిన చిరంజీవి, వరుణ్ తేజ్
  • వరుణ్ దోశ బాగా వచ్చింది.. నాకు కుళ్లు వచ్చిందన్న చిరు
Chiranjeevi and Varun Tej make dosas
ఏ పండుగ వచ్చినా మెగా ఫ్యామిలీ అంతా ఒక చోట చేరి సెలబ్రేట్ చేసుకోవడం తెలిసిందే. ఈ రోజు భోగి సందర్భంగా మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. ఉదయాన్నే భోగి మంటలు వేసి వేడుక చేసుకున్నారు. అనంతరం చిరంజీవి, వరుణ్ తేజ్ దోశలు వేసి ఇంట్లో వారికి పెట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

చిరంజీవి, వరుణ్ తేజ్ ఇద్దరూ పక్కపక్కనే నిలబడి రెండు పెనాలపై దోశలు వేస్తున్నారు. వరుణ్ వేస్తున్న దోశ చక్కగా, గుండ్రంగా వచ్చింది. చిరు వేసిన దేశ మాత్రం సరిగా రాలేదు. దీంతో వరుణ్ దోశ బాగా వచ్చింది, నాకు కుళ్లు వచ్చింది అంటూ వరుణ్ దోశను చిందరవందర చేశారు. వరుణ్ దోశను ఉప్మా చేసేశానని చిరు నవ్వుతూ అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను వరుణ్ తేజ్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. 'బాస్ చిరంజీవితో దోశ మేకింగ్ 101... 2022 భోగి.. అందరికీ శుభాకాంక్షలు' అని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వేడుకలో చిరంజీవి తల్లి అంజనాదేవి, నాగబాబు దంపతులు, నిహారిక, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కనిపించారు.