Cape Town: కేప్ టౌన్ టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట... రసవత్తరంగా మారిన పోరు

Third day play in Cape Town test completed
  • దక్షిణాఫ్రికా టార్గెట్ 212 రన్స్
  • ప్రస్తుతం 2 వికెట్లకు 101 పరుగులు
  • ఇంకా 111 పరుగుల దూరంలో సఫారీలు
  • ఆట చివర్లో ఎల్గార్ వికెట్ తీసిన బుమ్రా
  • మరో 8 వికెట్లు తీస్తే భారత్ కు విజయం

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో చివరి టెస్టు రసవత్తరంగా మారింది. కేప్ టౌన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మూడో రోజు ముగిసింది. 212 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆట చివరికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 111 పరుగులు చేయాలి.

లక్ష్య ఛేదనలో నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికాకు ఆట చివర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న కెప్టెన్ డీన్ ఎల్గార్ (30)ని బుమ్రా అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు మరో ఓపెనర్ మార్ క్రమ్ ను షమీ సులభంగానే పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం కీగాన్ పీటర్సన్ 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా, రేపటి ఆటలో 8 వికెట్లు పడగొట్టగలిగితే టీమిండియానే విజయం వరిస్తుంది. తద్వారా సిరీస్ కూడా వశమవుతుంది.

ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 210 పరుగులు సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయింది.

  • Loading...

More Telugu News