Cheteshwar Pujara: పుజారా, రహానేలను సాగనంపండి... సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్

Huge trolling on Pujara and Rahane
  • దక్షిణాఫ్రికా టూర్ లో వరుస వైఫల్యాలు
  • చెత్త బ్యాటింగ్ తో విమర్శలు
  • ఇప్పటికే ఇద్దరి మెడపై కత్తి!
  • ఈసారి సెలెక్ట్ కావడం కష్టమేనంటున్న విశ్లేషకులు

టీమిండియాలో ఒకప్పుడు సీనియర్ ఆటగాళ్లుగా ఓ వెలుగు వెలిగిన ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఇప్పుడు జట్టుకు భారంగా మారారు. పేలవ ఫామ్ తో వరుసగా విఫలమవుతున్న వీరిద్దరి మెడపై కొన్నాళ్లుగా కత్తి వేలాడుతూనే ఉంది. తాజాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లోనూ వీరి దారుణ ఆటతీరు కొనసాగింది. మూడో టెస్టులోనూ వీరు రాణించింది లేదు. పుజారా మాత్రం తొలి ఇన్నింగ్స్ లో 43 పరుగులు చేయగా, రహానే 9 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో పుజారా 9 పరుగులు చేయగా, రహానే 1 పరుగు చేసి మరోసారి నిరాశపరిచాడు.

ఈ నేపథ్యంలో వీరిద్దరినీ జట్టు నుంచి తొలగించాలంటూ నెటిజన్లు భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. PuRane (పురానే-పాతబడిన) అంటూ పుజారా, రహానే పేర్లు కలిసి వచ్చేలా హ్యాష్ ట్యాగ్ ను ప్రచారం చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కాగా, విమర్శకులు మాత్రం, పుజారా, రహానే తమ చివరి ఇన్నింగ్స్ ఆడేశారని, వచ్చే సిరీస్ కు వారు జట్టుకు ఎంపికవడం దాదాపు అసాధ్యమని అంటున్నారు.

గత రెండేళ్లుగా వీరిద్దరి ఆటతీరు ఇదే విధంగా ఉంది. సెంచరీ కాదు కదా, అర్ధసెంచరీలు కొట్టడమే గగనమైపోయింది. మరోవైపు శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్ మాన్ గిల్ వంటి ప్రతిభావంతులు రేసులో ఉండగా, ఈ సీనియర్ ఆటగాళ్ల ద్వయంపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ సిరీస్ లో రహానే 22.66 సగటుతో 136 పరుగులు చేయగా, పుజారా 20.66 సగటుతో 124 పరుగులు సాధించాడు.

విస్తృతస్థాయిలో షాట్లు ఆడలేకపోవడం రహానే బలహీనత కాగా, సాంకేతిక లోపాలతో పుజారా కూడా ఫామ్ కోల్పోయాడు. ముఖ్యంగా, పుజారా పరుగులు తీసేందుకు అత్యధిక సంఖ్యలో బంతులు ఎదుర్కోవడం డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతోందన్న ఓ వాదన వినిపిస్తోంది. పిచ్ మామూలుగా స్పందిస్తున్నా గానీ, పుజారా ఆటతీరు చూసి పిచ్ నిజంగా అంత కష్టసాధ్యంగా ఉందేమోనని మిగతా ఆటగాళ్లు ఆందోళనకు గురవుతున్నారట.

రహానే విషయానికొస్తే పేసర్లు ఆఫ్ స్టంప్ లోగిలిలో బంతులు వేస్తూ పెద్దగా శ్రమపడకుండానే అవుట్ చేయగలుగుతున్నారు. ఈ లోపాన్ని అధిగమించడం రహానే శక్తికి మించిన పనవుతోంది. మరి టీమిండియా సెలెక్టర్లు ఈసారి ఏంచేస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News