Tirumala: ఆలయాలలో వైకుంఠ ఏకాదశి సందడి.. శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ!

CJI NV Ramana and AP Tripura High Court Judges and ministers visits Tirumala
  • స్వామి వారిని దర్శించుకున్న ఏపీ, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తులు
  •  ఏపీ, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా
  • స్వామివారి అన్నప్రసాద ట్రస్టుకు భారత్ బయోటెక్ రూ. 2 కోట్ల విరాళం
  • నేటి నుంచి 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు
నేడు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. భక్తులతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుని భక్తులు పులకించిపోతున్నారు. కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆలయాల్లో కొవిడ్ మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు. అయితే, కొన్ని ఆలయాల్లో మాత్రం వైకుంఠ ద్వార దర్శనాలు రద్దు చేశారు.

ఇక, గత అర్ధరాత్రి దాటిన తర్వాత 12.05 గంటలకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచి ధనుర్మాస పూజలు నిర్వహించారు. అనంతరం 1.45 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. స్వామి వారిని వైకుంఠ ద్వారం నుంచి చూసి తరించేందుకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు.

గత రాత్రి తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. అలాగే, ఈ తెల్లవారుజామున భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి అన్నప్రసాద ట్రస్టుకు భారత్ బయోటెక్ తరపున రూ. 2 కోట్ల విరాళం అందజేశారు.

వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా దంపతులు, త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ దంపతులు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ దుర్గాప్రసాద్, జస్టిస్ రమేశ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు జయరామ్, వెల్లంపల్లి శ్రీనివాస్, రంగనాథరాజు, సురేశ్, బాలినేని, అనిల్ యాదవ్ దంపతులు, అవంతి శ్రీనివాస్ దంపతులు, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు రోజా, శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీ సీఎం రమేశ్ దంపతులు, మాజీ మంత్రి చినరాజప్ప, లక్ష్మీపార్వతి, తెలంగాణ మంత్రి హరీశ్ రావు దంపతులు, గంగుల కమలాకర్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.

ప్రముఖుల దర్శనాలు పూర్తయిన అనంతరం సామాన్య భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. కాగా, నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులను అనుమతించనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు స్వామివారు స్వర్ణ రథంపై ఊరేగనున్నారు.
Tirumala
Tirupati
Vaikuntha Dwara Darshanam
Mukkoti Ekadasi

More Telugu News