COVID19: ఇవీ ఒమిక్రాన్ లక్షణాలే.. ఎలాంటి సూచనల్లేకుండానే వస్తున్నాయంటున్న నిపుణులు!

  • వాంతులు, ఆకలి లేకపోవడమూ ఒమిక్రాన్ లక్షణాలే
  • వాసన, రుచి కోల్పోవడం కూడా
  • 75% మంది పేషెంట్లలో కనిపిస్తున్న లక్షణాలు
  • నిర్లక్ష్యం చేయొద్దంటున్న నిపుణులు
  • జలుబు లక్షణాలున్నా టెస్ట్ చేయించుకోవాలని సూచనలు
Loss Of Appetite Vomiting Are the Omicron Symptoms

ఒమిక్రాన్ వ్యాప్తి చెందిన మొదట్లో దాని లక్షణాలు కూడా చాలా మందికి అంతుబట్టలేదు. ఆ తర్వాత తలనొప్పి, తీవ్రమైన అలసట, గొంతు గరగర, స్వల్ప జ్వరం, రాత్రిపూట చెమటలు వంటివి కొత్త వేరియంట్ లక్షణాలుగా గుర్తించారు. అయితే, ఒరిజినల్ కరోనా లక్షణాలూ దీనికి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

వాసన, రుచి కోల్పోవడం కూడా ఒమిక్రాన్ లక్షణాలని కింగ్స్ కాలేజ్ లండన్ లోని జెనెటిక్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ అంటున్నారు. అయితే, ఈ రెండు లక్షణాలు ఎలాంటి సూచనల్లేకుండానే వచ్చేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. వాంతులు, వాంతికి వచ్చినట్టు అనిపించడం, ఆకలి తగ్గిపోవడం కూడా ఒమిక్రాన్ లక్షణాలని స్పష్టం చేశారు. అలసట, ముక్కు కారడం, జలుబు, దగ్గు కూడా ఒమిక్రాన్ సాధారణ లక్షణాలని తేల్చి చెప్పారు.

కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దని, వెంటనే టెస్టు చేయించుకోవాలని సూచించారు. 75 శాతం మంది పేషెంట్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. తలనొప్పి వచ్చినా అలక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ సోకిన వారికి తరచూ ఈ లక్షణం కనిపిస్తోందని అంటున్నారు. జలుబు లాంటి లక్షణాలున్నా వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాలని టిమ్ స్పెక్టర్ సూచించారు. కరోనానో కాదో తెలిసేంతవరకు ఇంట్లోనే ఉండడం మంచిదని చెప్పారు. కాగా, లక్షణాలు కనిపించిన దగ్గర్నుంచి పది రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాలని అమెరికా సీడీసీ ఇప్పటికే సూచించింది.

More Telugu News