Saina Nehwal: దుమారం రేపుతున్న వివాదాస్పద ట్వీట్‌పై సినీ నటుడు సిద్ధార్థ్ క్షమాపణ.. ‘డియర్ సైనా..’ అంటూ లేఖ

  • ప్రధానమంత్రి మోదీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సైనా ట్వీట్
  • బదులుగా ట్వీట్ చేసి విమర్శలపాలైన సిద్ధార్థ్
  • క్షమించమని వేడుకుంటూ ట్విట్టర్‌లో సైనాకు లేఖ
  • మహిళలంటే తనకు ఎప్పటికీ గౌరవమేనన్న నటుడు
  • వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని వేడుకోలు
Actor Siddharth apologies to Badminton star saina nehwal

హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపియన్ సైనా నెహ్వాల్‌పై చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపడంతో సినీ నటుడు సిద్ధార్థ్ స్పందించాడు. సైనాకు క్షమాపణలు చెప్పాడు. ‘డియర్ సైనా’.. అని మొదలు పెడుతూ రాసిన ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. తానో అసభ్యకరమైన జోక్ చేశానని, అందుకు క్షమించాలని వేడుకున్నాడు. మీ ట్వీట్‌కు తాను స్పందించిన తీరు, వాడిన భాష సరికాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

అయితే, అది తాను దురుద్దేశంతో చేసిన ట్వీట్ కాదని, మహిళలంటే తనకు ఎనలేని గౌరవమని చెప్పుకొచ్చాడు. తన ట్వీట్‌లో లింగ వివక్ష ఏమీ లేదని, మీరు మహిళ కాబట్టి దాడి చేయాలన్న ఉద్దేశం తనకు ఎంతమాత్రమూ లేదని, కాబట్టి ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెడదామని కోరాడు. మీరెప్పుడూ నా చాంపియనేనని, తన క్షమాపణలు అంగీకరిస్తారని ఆశిస్తున్నానంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల పంజాబ్‌లో పర్యటించిన సందర్భంగా భద్రతా లోపం తలెత్తడంతో ఆయన కాన్వాయ్ దాదాపు 20 నిమిషాలపాటు రోడ్డుపై ఆగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. సైనా నెహ్వాల్ కూడా మోదీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది.

దీనికి సమాధానంగా సిద్ధార్థ్ ట్వీట్ చేస్తూ వాడిన భాషపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దిగొచ్చిన సిద్ధార్థ్ తనను క్షమించమంటూ ట్వీట్ చేసి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.  

More Telugu News