USA: అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వెల్లువలా కరోనా పాజిటివ్ కేసులు

US and Australia registers huge number of corona cases
  • అమెరికాలో రికార్డుస్థాయిలో కేసులు
  • ఒక్కరోజులో 11 లక్షల కొత్త కేసులు
  • ఆస్ట్రేలియాలోనూ కొవిడ్ విజృంభణ 
  • వారం రోజుల వ్యవధిలో 5 లక్షల కొత్త కేసులు
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బీభత్సంగా వ్యాపిస్తోంది. ఒక్కరోజులో 10 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెల్లడి కావడం అక్కడి పరిస్థితిని వెల్లడిస్తోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు వస్తుండడంతో అమెరికాలో ఆందోళన నెలకొంది. నిన్న ఒక్కరోజే అమెరికాలో 11 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జనవరి 3న 10 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పుడా రికార్డు బద్దలైంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్కరోజు ఇన్ని కేసులు మరే దేశంలోనూ నమోదు కాలేదు.

మరోవైపు ఒమిక్రాన్ సైతం తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. అమెరికాలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఒకేరోజు 1.35 లక్షల మంది ఆసుపత్రిలో చేరినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఇక, కరోనా తొలిదశలో వైరస్ మహమ్మారిని సమర్థంగా కట్టడి చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత  కరోనా కేసుల వెల్లువను ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాలో గడచిన వారం రోజుల వ్యవధిలో 5 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా పరిస్థితిపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. ప్రస్తుతం చేతిలో ఉన్నవి రెండే అవకాశాలు అని, లాక్ డౌన్ విధించడమో లేక కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ ముందుకు పోవడమోనని తెలిపారు. అమితవేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ ముప్పును దీటుగా ఎదుర్కోవాలని ప్రజలకు, వ్యవస్థలకు పిలుపునిచ్చారు.
USA
Australia
Corona Virus
New Cases

More Telugu News