Novak Djokovic: ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఈసారి సర్కారుపైనే విజయం సాధించిన టెన్నిస్ స్టార్ జకోవిచ్!

  • ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు మెల్‌బోర్న్ చేరుకున్న జకోవిచ్
  • వీసాను రద్దు చేసి డిటెన్షన్ సెంటర్‌కు తరలింపు
  • ఆదేశాలు వెలువడిన 30 నిమిషాల లోపు విడుదల చేయాలని కోర్టు ఆదేశం
  • ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు కోర్టు అనుమతి
  • పంతం నెగ్గించుకునే యోచనలో ప్రభుత్వం
Novak Djokovic Wins Case Australia Judge Orders Release

సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఘన విజయం సాధించాడు. రద్దు చేసిన జకోవిచ్ వీసాను పునరుద్ధరించడంతోపాటు తక్షణమే అతడిని నిర్బంధం నుంచి విడుదల చేయాలని ఫెడరల్ సెక్యూరిటీ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా విదేశీ ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధిస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఇది అసాధారణ ఎదురుదెబ్బేనని చెబుతున్నారు.

34 ఏళ్ల జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు గత గురువారం మెల్‌బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి చాంపియన్ స్వాగతం లభించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా తీవ్ర అవమానం జరిగింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడని, నిర్దిష్ట కారణాలు చూపకుండా వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు పొందాడని ఆరోపిస్తూ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి వీసాను రద్దు చేశారు.

అంతేకాకుండా ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించి నిర్బంధించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా గెలిచి, 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డులకెక్కాలని ఉవ్విళ్లూరిన జకోవిచ్‌ ఇలా నిర్బంధంలోకి వెళ్లిపోవడం అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

సెర్బియా ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి ఆస్ట్రేలియా ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొవిడ్ నిబంధనల విషయంలో తమకు అందరూ సమానమేనని తేల్చి చెప్పింది. మరోవైపు, తన వీసా రద్దును జకోవిచ్ న్యాయస్థానంలో సవాలు చేశాడు. తన లాయర్లతో మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వకుండానే వీసాను రద్దు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.

ఆన్‌లైన్ అత్యవసర కోర్టు నిన్న విచారణ ప్రారంభించి జకోవిచ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నొవాక్ వీసా రద్దును తీవ్రంగా తప్పుబట్టిన న్యాయమూర్తి ఆంథోనీ కెల్లీ.. జకోవిచ్ వీసాను తక్షణం పునరుద్ధరించడంతోపాటు ఆదేశాలు వెలువడిన అరగంటలోపు జకోవిచ్‌ను నిర్బంధం నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు పొందేందుకు అవసరమైన అన్ని ఆధారాలను అతడు సమర్పించాడని పేర్కొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడొచ్చని స్పష్టం చేశారు.

కోర్టు తీర్పుపై జకోవిచ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడతానని స్పష్టం చేశాడు. నిర్బంధం నుంచి విడుదలైన వెంటనే ప్రాక్టీస్ ప్రారంభించాడు. అయితే, కోర్టు తీర్పు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం తన పంతం నెగ్గించుకునేలానే కనిపిస్తోంది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది క్రిస్టోఫర్ మాట్లాడుతూ.. ఇమ్మిగ్రేషన్ మంత్రి అలెక్స్ హాక్ తన ‘వ్యక్తిగత రద్దు అధికారాన్ని’ ఉపయోగించుకోవచ్చని, ఈ విషయాన్ని ఆయన పరిశీలిస్తున్నారని కోర్టుకు తెలిపారు.

ఒకవేళ మంత్రి కనుక తన వ్యక్తిగత అధికారాన్ని ఉపయోగించి వీసాను రద్దు చేస్తే కనుక జకోవిచ్ మూడేళ్లపాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టలేడు. కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో వ్యక్తిగత అధికారాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవాలని కనుక నిర్ణయించుకుంటే జకోవిచ్ ఆస్ట్రేలియాను వీడక తప్పకపోవచ్చు. కాగా,  ఈ నెల 17 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది.

More Telugu News