Supreme Court: మోదీ కాన్వాయ్‌ను అడ్డగించింది మేమే.. ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’

  • విచారణ వెంటనే నిలిపివేయండి
  • న్యాయవాదులకు రెండుసార్లు రికార్డెడ్ ఫోన్‌కాల్స్
  • విచారణ చేపడితే జాతీయ సమగ్రత దెబ్బతింటుందని హెచ్చరిక
SC lawyers get threat calls from Sikhs for Justice on PM Narendra Modi security breach

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల పంజాబ్‌లో పర్యటించిన సందర్భంగా భద్రతా లోపం తలెత్తి ఆయన కాన్వాయ్ దాదాపు 20 నిమిషాలపాటు రోడ్డుపై నిలిచిపోయింది. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమెరికా కేంద్రంగా పనిచేసే ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) కీలక ప్రకటన చేసింది. మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్నది తామేనని ప్రకటించినట్టు సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నిన్న కోర్టు దష్టికి తీసుకెళ్లింది.

మోదీ కాన్వాయ్ రోడ్డుపై నిలిచిపోవడానికి కారణం తామేనని, భద్రతా వైఫల్యాలపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలని, ఈ ఘటనపై ఓ ఎన్‌జీవో దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరపవద్దని న్యాయవాదులను బెదిరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. న్యాయవాదుల సంఘం పేర్కొన్న ప్రకారం.. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నిన్న ఉదయం 10.40 గంటలకు ఓసారి, మధ్యాహ్నం 12.36 గంటలకు మరోసారి రికార్డెడ్ ఫోన్ కాల్స్ వచ్చాయి. మోదీ కాన్వాయన్‌ను అడ్డుకోవడం వెనక ఉన్నది తామేనని అందులో వారు అంగీకరించారు.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులను శిక్షించడంలో సుప్రీంకోర్టు విఫలమైందని, వేలాది మంది సిక్కు రైతులు చనిపోయినా ఎవరూ నోరు మెదపలేదని అన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టవద్దని ఆ ఫోన్‌కాల్‌లో హెచ్చరించారు. అంతేకాదు, విచారణ చేపడితే జాతీయ భద్రత, సమగ్రతను దెబ్బతీసే అత్యంత ప్రతికూల చర్యలు ఎదుర్కొంటారని కూడా హెచ్చరించినట్టు ధర్మాసనానికి రాసిన లేఖలో న్యాయవాదుల సంఘం పేర్కొంది.

సుప్రీంకోర్టు కేసు వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని న్యాయవాదులు తమ ఫోన్లలో సేవ్ చేసుకున్నారని, అవి కనుక హ్యాకింగ్‌కు గురైతే ఆ వివరాలన్నీ దుర్వినియోగం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇలాంటి ఫోన్‌కాల్స్ న్యాయవాదులందరికీ వస్తున్నట్టు పేర్కొంటూ దీపక్ ప్రకాశ్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News