Raghu Rama Krishna Raju: సంక్రాంతికి నరసాపురం వెళుతున్నా!: ఎంపీ రఘురామకృష్ణరాజు

  • కొంతకాలంగా వైసీపీతో రఘురామ వార్
  • రఘురామపై అనర్హత వేటుకు వైసీపీ తీవ్ర యత్నాలు
  • ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నానన్న రఘురామ
  • తాను గెలిస్తే సీఎం రాజీనామా చేయాలని సవాల్
MP Raghurama challenges YCP leaders

గత ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు స్థానిక నేతలతోనూ, పార్టీ అధినాయకత్వంతోనూ తీవ్ర విభేదాలు కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా నరసాపురం నియోజకవర్గానికి దూరంగా ఢిల్లీలోనూ, హైదరాబాదులోనూ ఉంటున్నారు. తాజాగా రఘురామ ఆసక్తికర ప్రకటన చేశారు. తనపై అనర్హత వేటు వేసుకోవచ్చని, అందుకు వైసీపీ నాయకత్వానికి ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నానని సవాలు విసిరారు.

తాను మళ్లీ పోటీ చేస్తానని, గెలిస్తే సీఎం జగన్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ తప్పుకుని వైఎస్ భారతి, విజయసాయి, సజ్జల, పెద్దిరెడ్డి వంటి వారిలో ఒకరికి పదవి అప్పగించాలని అన్నారు. ఒకవేళ తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.

అంతెందుకు సీఎం జగన్ 'అనర్హత' అనే పదాన్ని 10 సార్లు సరిగ్గా పలికితే తాను అనర్హతకు గురైనట్టే భావిస్తానని మరో సవాల్ విసిరారు. సంక్రాంతి నేపథ్యంలో ఈ నెల 13న నరసాపురం వెళుతున్నానని, రెండ్రోజుల పాటు అక్కడే ఉంటానని వెల్లడించారు.

More Telugu News