Perni Nani: చట్టం అందరికీ ఒకటే: వర్మతో భేటీ అనంతరం పేర్ని నాని వ్యాఖ్యలు

Perni Nani talks to media after meeting with Ram Gopal Varma
  • పేర్ని నాని, రామ్ గోపాల్ వర్మ సమావేశం
  • జీవో ప్రకారమే టికెట్ల ధరలు అని వెల్లడి
  • చట్టానికి వ్యతిరేకంగా పోలేదని మంత్రి స్పష్టీకరణ
  • అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చని సూచన
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సమావేశం అనంతరం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వర్మతో సమావేశం వివరాలను మీడియా ముఖంగా వెల్లడించారు. సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా జీవో నెం.35 ప్రకారం సినిమా టికెట్ల ధరలు నిర్దేశించామని చెప్పారు. ఎక్కడా చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని వర్మకు వివరించినట్టు తెలిపారు. సినిమా టికెట్ ధరల విషయంలో తమ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని అన్నారు.

"ఇందులో మేం కొత్తగా సృష్టించిందేమీ లేదు... ఎవరినీ ఇబ్బందిపెట్టిందీ లేదు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. చట్టం అందరికీ ఒకటే. రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలి, పసుపు లైటు వెలిగితే అటూ ఇటూ చూసుకోవాలి, పచ్చ లైటు వెలిగితే ముందుకు పోవాలి. ఇది అందరికీ రూలు. రూలు ఉందన్న విషయం తప్ప అంతకుమించి ఎవరికీ ఏమీ చెప్పలేదు.

2013లో ఇచ్చిన జీవో నెం.100లో పేర్కొన్న దానికంటే టికెట్ల ధరను పెంచాం. ఎవరికైనా టికెట్ల ధరలు ఇంకా పెంచాలన్న అభిప్రాయం ఉంటే మేం ఏర్పాటు చేసిన కమిటీతోనూ, లేక మాతోనూ మాట్లాడొచ్చు. ఇవాళ వర్మగారు వచ్చినట్టే ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. వారి అభిప్రాయాలను తప్పకుండా కమిటీకి నివేదిస్తాం" అని పేర్ని నాని వివరించారు.
Perni Nani
Ram Gopal Varma
Cinema Tickets Rates
AP Govt
Tollywood

More Telugu News