సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న భారీ సినిమాలు.. విడుదల కాబోతున్న సినిమాలు ఇవే!

10-01-2022 Mon 12:18
  • కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ భారీ బడ్జెట్ చిత్రాలు
  • సంక్రాంతి బరిలో దిగుతున్న యువ హీరోల చిత్రాలు
  • ఈ నెల 14న విడుదలవుతున్న 'బంగార్రాజు'
List of Telugu movies releasing in Sankranthi season
కరోనా వైరస్ సినీ పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో భారీ బడ్జెట్ చిత్రాలన్నీ విడుదలను వాయిదా వేసుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్', 'భీమ్లా నాయక్' తదితర చిత్రాల విడుదల వాయిదా పడింది. దీంతో యువ కథానాయకుల సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి.

సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు ఇవే:
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న పెద్ద చిత్రం 'బంగార్రాజు'. ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్య, కృతిశెట్టి, రమ్యకృష్ణ నటించారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కానుంది.

ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'రౌడీ బాయ్స్' చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన 'హీరో' చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ నటించిన 'సూపర్ మచ్చి' చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ చిత్రంలో రియా చక్రవర్తి, రుచితా రామ్ హీరోయిన్లుగా నటించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా ఆలస్యంగా విడుదలవుతోంది.

ప్రిన్స్, నేహ జంటగా నటించిన 'ది అమెరికన్ డ్రీమ్' చిత్రం జనవరి 14న విడుదలవుతోంది. ఆహా ఓటీటీలో ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది.