Vijayawada: ప్రేమను తిరస్కరించిందని అక్కసు.. విజయవాడలో ఇంటర్ విద్యార్థినిపై హత్యాయత్నం

Attempted murder of an inter student in Vijayawada
  • పాఠశాల రోజుల నుంచీ ప్రేమను పెంచుకున్న నిందితుడు
  • బాలిక పుట్టిన రోజున ప్రేమను తెలియజేసిన యువకుడు
  • నిరాకరించడంతో కక్ష పెంచుకున్న వైనం
  • ఇంట్లోకి చొరబడి బ్లేడుతో మెడపై దాడి
  • నిలకడగా బాలిక ఆరోగ్యం
తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఇంటర్ విద్యార్థినిని హతమార్చేందుకు యత్నించాడో యువకుడు. విజయవాడలోని భారతీనగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ బాలిక ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు విభేదాల కారణంగా వేర్వేరుగా జీవిస్తున్నారు. తండ్రి వద్ద ఉంటున్న బాలిక పాఠశాలలో చదువుతున్నప్పుడే హరీశ్ అనే సీనియర్ విద్యార్థి ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో టెన్త్ పూర్తయ్యాక హైదరాబాద్ వెళ్లిపోయిన హరీశ్ ఈ నెల 7న బాలిక బర్త్‌డేను పురస్కరించుకుని నగరానికి వచ్చాడు. ఈ సందర్భంగా తాను ప్రేమిస్తున్న విషయాన్ని ఆమెకు చెప్పాడు. అందుకామె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. స్నేహితులకు ఈ విషయం చెబుతూ తనకు దక్కనిది మరెవరికీ దక్కకుండా చేస్తానని చెప్పాడు. అయితే, స్నేహితులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.

మరోవైపు, బాలికపై కక్ష పెంచుకున్న హరీశ్ మాత్రం నిన్న ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి బాలికపై దాడిచేశాడు. ఆపై బ్లేడుతో మెడపై గాయపరిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడు హరీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Vijayawada
Lover
Crime News
Andhra Pradesh

More Telugu News