ఉజ్జయిని మహాకాళేశ్వరుని సేవలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్

08-01-2022 Sat 22:28
  • మధ్యప్రదేశ్ లో కేరళ గవర్నర్ పర్యటన
  • ఉజ్జయిని వచ్చిన ఆరిఫ్ మహ్మద్ ఖాన్
  • మహాకాళేశ్వర ఆలయంలో పూజలు
  • దేశ క్షేమాన్ని కోరుకున్నానని వెల్లడి
Kerala governor Arif Mohammed Khan offers prayers at Ujjain Mahakaleswar Temple
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో కొలువైన్న మహాకాళేశ్వర ఆలయం దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. మహాశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదొకటి. కాగా, మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఉజ్జయిని విచ్చేశారు. ఇక్కడి మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు, మహా హారతి (భోగ్ ఆర్తి) సమయంలోనూ స్వామివారి సేవలో తరించిపోయారు.

కాగా కేరళ గవర్నర్ ను ఆలయం వద్ద మీడియా పలకరించింది. స్వామివారిని ఏం కోరుకున్నారు? అని ప్రశ్నించగా, దేశ సంక్షేమాన్ని కోరుకున్నానని బదులిచ్చారు. అభివృద్ధిని ప్రసాదించాలని ప్రార్థించినట్టు తెలిపారు. ప్రస్తుతం దేశం ఓ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దాన్నుంచి గట్టెక్కేలా చేయమని కోరుకున్నట్టు వివరించారు.