Maoist: పెళ్లి చేసుకునేందుకు పారిపోయిన మావోయిస్టు జంట.. కాల్చి చంపిన నక్సల్స్

Maoists Kill Couple In Ranks With Marriage Plan In Chhattisgarh
  • ప్రేమించుకుని పెళ్లి చేసుకునేందుకు శిబిరం విడిచిన జంట
  • వెతికి పట్టుకుని ప్రజాకోర్టు.. ఆపై దారుణ హత్య
  • అదే ప్రాంతంలో మరొకరిని కూడా హత్య చేసిన మావోలు
ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న నక్సల్స్ జంట శిబిరం నుంచి పారిపోయింది. వారిని వెతికి పట్టుకున్న మావోలు ప్రజాకోర్టు నిర్వహించి అనంతరం దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. గంగలూరు ఏరియా కమిటీ మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లు పునెం, మిలీషియా సభ్యురాలు మంగి గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ మొగ్గతొడిగింది. అది మరింత బలపడడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.  

ఈ క్రమంలో గురువారం క్యాంపు నుంచి పరారయ్యారు. దీంతో మావోయిస్టు క్యాంపులో కలకలం రేగింది. వారి కోసం గాలించి చివరికి వెతికి పట్టుకున్నారు. అనంతరం ప్రజాకోర్టు నిర్వహించి వారిని దారుణంగా హత్య చేశారని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్ రాజు తెలిపారు. కాగా, పునెం 11 మావోయిస్టు సంబంధిత కేసుల్లో మోస్ట్ వాంటెడ్ కాగా, మూడు ఘటనల్లో మంగి పేరు పోలీసు రికార్డుల్లో ఉంది.

కాగా, గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే మరో వ్యక్తి కూడా హత్యకు గురైనప్పటికీ ఆయనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని ఐజీ పేర్కొన్నారు. కాగా, వీరిని హత్య చేసిన ప్రాంతంలోనే మరో వ్యక్తి మృతదేహాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఐజీపీ తెలిపారు.
Maoist
Chhattisgarh
Bijapur
Couple
Marriage

More Telugu News