Mohammed Rizwan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ అవార్డులు: అత్యంత విలువైన క్రికెటర్ గా మహ్మద్ రిజ్వాన్ ఎంపిక!

  • టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డూ రిజ్వాన్ కే
  • వన్డే క్రికెటర్ అవార్డును అందుకున్న బాబర్ ఆజం
  • ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా మహ్మద్ వసీం జూనియర్  
Mohammed Rizwan Awarded Most Valuable Cricketer Of The Year

2021గానూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఆటగాళ్లకు అవార్డులను ప్రకటించింది. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డును అందుకున్నాడు. గత ఏడాది 9 టెస్టులు ఆడి 455 పరుగులు, 6 వన్డేల్లో 134 పరుగులు, 29 టీ20ల్లో 1,326 రన్స్ తో పాటు కీపింగ్ లో 56 మంది బ్యాటర్లను ఔట్ చేసిన అతడిని మోస్ట్ వాల్యుయేబుల్ క్రికెటర్ గా ఎంపిక చేసింది. అంతేగాకుండా టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డునూ రిజ్వాన్ అందుకున్నాడు.

అలాగే, బాబర్ ఆజం, షహీన్ అఫ్రిదీలకు కూడా అవార్డులను ప్రదానం చేసింది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ మీద 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన షహీన్ అఫ్రిదీని ప్రభావవంతమైన ప్రదర్శన చేసిన ఆటగాడిగా అవార్డిచ్చింది. 6 వన్డేల్లో 405 పరుగులు చేసిన బాబర్ ఆజంను వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది.

15 వికెట్లు పడగొట్టిన మహ్మద్ వసీం జూనియర్ కు ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డిచ్చింది. 9 టెస్టుల్లో 41 వికెట్లు పడగొట్టిన హసన్ అలీని టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. అతడు ఐదు సార్లు 5 వికెట్లు పడగొట్టగా, ఒకసారి పది వికెట్లు తీశాడు. కాగా, 10 వన్డేల్లో 363 పరుగులతో పాటు 6 వికెట్లు, 6 టీ20ల్లో 95 పరుగులు చేసి 5 వికెట్లు తీసిన నిదా దార్ ను విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేసింది.

More Telugu News