Team India: రెండో టెస్టులో టీమిండియా ఓటమి... సిరీస్ ను 1-1తో సమం చేసిన సఫారీలు

Team India lost second test held at Johannesburg
  • 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా
  • 96 పరుగులతో అజేయంగా నిలిచిన ఎల్గార్
  • మరో రోజు ఆట మిగిలుండగానే జయకేతనం
  • ఈ నెల 11 నుంచి మూడో టెస్టు
సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు సొంతగడ్డపై అద్భుత విజయాన్ని అందుకుంది. జోహాన్నెస్ బర్గ్ లో టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో డీన్ ఎల్గార్ నాయకత్వంలోని సఫారీలు 7 వికెట్ల తేడాతో గెలిచారు. 240 పరుగుల విజయలక్ష్యాన్ని మరొక రోజు ఆట మిగిలుండగానే ఛేదించారు. కెప్టెన్ డీన్ ఎల్గార్ ముందుండి జట్టును నడిపించడం విశేషం. ఎల్గార్ 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్ మార్ క్రమ్ 31, కీగాన్ పీటర్సన్ 28, రాస్సీ వాన్ డర్ డుస్సెన్ 40, టెంబా బవుమా 23 (నాటౌట్) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు ఎక్స్ ట్రాల రూపంలో 25 పరుగులు సమర్పించుకున్నారు. టీమిండియా బౌలర్లలో షమీ, ఠాకూర్, అశ్విన్ తలో వికెట్ తీశారు.

కాగా, మూడు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టును టీమిండియా నెగ్గడం తెలిసిందే. రెండో టెస్టులో గెలవడం ద్వారా దక్షిణాఫ్రికా 1-1తో సిరీస్ సమం చేసింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు ఈ నెల 11 నుంచి కేప్ టౌన్ వేదికగా జరగనుంది.
Team India
Second Test
South Africa
Johannesburg

More Telugu News