Buddhist Varsity: విదేశీ విద్యార్థులపై తెలంగాణ సర్కారు కన్ను.. నాగార్జున సాగర్ లో బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు!

Buddhist Varsity In South At nagarjunasagar Telangana
  • బౌద్ధ సంస్కృతి, సాహిత్యం కోర్సులు
  • ఇతర కోర్సులు సైతం బోధన
  • ముఖ్యమంత్రి ముందుకు ప్రతిపాదన
  • అనుమతి లభిస్తే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ సర్కారు సరికొత్త ఆలోచన చేసింది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో బుద్ధిస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రణాళికతో ఉంది. హైదరాబాద్ కు 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జున సాగర్ లో ఇప్పటికే 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం ఏర్పాటై ఉంది. ఇందులోనే యూనివర్సిటీకి 40-60 ఎకరాలను ఇవ్వాలన్నది సర్కారు యోచన.

బుద్ధుడిపై ఎన్నో పరిశోధనలు చేసిన ఆచార్య నాగార్జున ఈ ప్రాంతంలోనే నివసించాడని, మహాయానాన్ని బోధించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు దక్షిణాదిలోనే మొదటిది అవుతుంది. కోర్సుల పరంగానూ వినూత్నంగా ఉండనుంది.

‘‘ప్రతిపాదిత యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా స్థలం కేటాయించాలని ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించాం. సవివరమైన ప్రాజెక్టు నివేదికను రూపొందించడం పూర్తయింది. దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు.

బౌద్ధ సంస్కృతి, శిల్పకళ, సాహిత్యం, వైద్యం, చిత్రకళలు, హాస్పిటాలిటీ, మార్షల్ ఆర్ట్స్, ఇంజనీరింగ్, పాలన, నిర్వహణ, టెక్నాలజీ తదితర విభాగాల్లో మొత్తం 68 సబ్జెక్టులను యూనివర్సిటీలో బోధించే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. యూనివర్సిటీ అభివృద్ధికి మలేషియా నుంచి ఒక బృందం ఆసక్తి చూపించినట్టు తెలిపారు.

ఇక్కడే బెంగళూరుకు చెందిన మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో ఒక ఆశ్రమం ఏర్పాటు కానున్నట్టు పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తైవాన్ కు చెందిన ఫోగాంగ్ షాన్ ఆశ్రమం కూడా రానుందని చెప్పారు. దలైలామా ఆధ్వర్యంలో వెల్ నెస్ సెంటర్ కూడా ఏర్పాటవుతుందన్నారు.

ఇక ఈ బుద్ధవనం ప్రాజక్టు కాంగ్రెస్ హయాంలో మొదలైనప్పటికీ, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఊపందుకుని త్వరితగతిన పూర్తయింది. దీనికి సుమారు రూ.68 కోట్ల వరకు వ్యయం అయింది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు.    
Buddhist Varsity
nagarjunasagar
telangana

More Telugu News