Bulli Bai: బుల్లీభాయ్ తరహాలో హిందూ మహిళలను వేధిస్తున్న టెలిగ్రామ్ చానల్.. రంగంలోకి పోలీసులు!

Telegram channel targeting Hindu women surfaces after Bulli Bai
  • హిందూ మహిళల ఫొటోలను అసభ్యకరంగా మార్చి షేర్ చేస్తున్న చానల్
  • యూట్యూబర్ అన్షుల్ ట్వీట్‌తో వెలుగులోకి
  • వెంటనే బ్లాక్ చేసిన కేంద్రం
  • చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన బుల్లీభాయ్ యాప్ తరహాలోనే మరోటి వెలుగులోకి వచ్చింది. బుల్లీభాయ్ యాప్‌లో ముస్లిం మహిళలను వేలానికి పెట్టగా, ఇందులో హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. హిందూ మహిళల ఫొటోలను షేర్ చేస్తున్న ఓ టెలిగ్రామ్ చానల్‌ను గుర్తించిన ఐటీ శాఖ దానిని బ్లాక్ చేసింది.

 దానిపై చర్యల కోసం రాష్ట్రాల పోలీసు అధికారులతో ప్రభుత్వం సమన్వయం చేసుకుంటున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. అన్షుల్ సక్సేనా అనే యూట్యూబర్.. ట్విట్టర్ ద్వారా ఐటీశాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

టెలిగ్రామ్ చానల్‌తోపాటు కొన్ని ఫేస్‌బుక్ పేజీలు హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకున్నాయని, వారి ఫొటోలను అసభ్యకరంగా మార్చి షేర్ చేస్తున్నట్టు అన్షుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వెంటనే స్పందించిన ఐటీ శాఖ ఆ చానల్‌ను బ్లాక్ చేసింది. నిర్వాహకులపై  కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.

మరోవైపు, వివాదాస్పద బుల్లీభాయ్ యాప్ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు దూకుడు పెంచారు. ఈ యాప్‌తో సంబంధం ఉన్న మయాంక్ రావల్ (21) అనే యువకుడిని ఉత్తరాఖండ్‌లో నిన్న అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయయిన వారి సంఖ్య మూడుకు చేరింది. వీరిలో ఇద్దరు ఉత్తరాఖండ్‌కు చెందిన వారు కాగా, ఒకరు బెంగళూరు వాసి.
Bulli Bai
Telegram Channel
Hindu Women
India

More Telugu News