C Kalyan: నిర్మాతల్లో ఐక్యత లేదని అనడం సరికాదు: మోహన్ బాబుకు నిర్మాత సి. కల్యాణ్ కౌంటర్

Producer C Kalyan differs with Mohan Babu comments
  • నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్ బాబు
  • ఆయన కూడా నిర్మాత అనే విషయాన్ని మోహన్ బాబు గుర్తుంచుకోవాలన్న కల్యాణ్
  • సమస్యల పరిష్కారం కోసం మీరు ముందుంటే మేము మీ వెనకుంటామని వ్యాఖ్య
ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఓవైపు ప్రభుత్వం, సినీ పరిశ్రమలోని కొందరి మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా... మరోవైపు ఇండస్ట్రీ వ్యక్తుల మధ్య కూడా వాదనలు జరుగుతున్నాయి. తాజాగా నటుడు మోహన్ బాబు స్పందిస్తూ... సినిమా పరిశ్రమ అంటే నలుగురు హీరోలు, నలుగురు నిర్మాతలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదని అన్నారు. నిర్మాతల మధ్య ఐక్యత లేదని చెప్పారు.  

ఈ వ్యాఖ్యలపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ... మోహన్ బాబు వ్యాఖ్యలను తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో నిర్మాతల మండలి చర్చిస్తూనే ఉందని అన్నారు. నిర్మాతల్లో ఐక్యత లేదని మోహన్ బాబు అన్నారని... ఆయన కూడా ఒక నిర్మాతే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. తమరి కొడుకు విష్ణు కూడా నిర్మాతేనని అన్నారు. మీ కుటుంబం మొత్తం సినిమా రంగంలోనే ఉందని చెప్పారు.

తమ వల్ల సమస్య పరిష్కారం కాదని అనుకుంటే మీరే ముందుండి పరిష్కరించండని మోహన్ బాబుకు కల్యాణ్ సూచించారు. మీరు ముందుంటే తామంతా మీ వెనుక ఉంటామని చెప్పారు. నిర్మాతల్లో ఐక్యత లేదని చెప్పడం సరికాదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మోహన్ బాబు ఇంకా స్పందించాల్సి ఉంది.
C Kalyan
Mohan Babu
Tollywood
Tickets

More Telugu News