China: గల్వాన్​ లోయలో చైనా జెండా.. నూతన సంవత్సరం రోజే డ్రాగన్​ కంట్రీ దుందుడుకు చర్య.. ఇదిగో వీడియో

  • చైనా పతాకం ఎగరేసిన పీఎల్ఏ సైనికులు
  • గొడవ జరిగిన చోటు నుంచి 1.2 కిలోమీటర్ల దూరంలో ఆవిష్కరణ
  • కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు
Chinese Army Hoisted Flag In Galwan Valley

చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. నూతన సంవత్సరం రోజే వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ లోయలో జెండాను ఎగరేసి కయ్యానికి కాలు దువ్వింది. ఆ వీడియోలను చైనాకు చెందిన జర్నలిస్టులూ షేర్ చేసుకున్నారు.

కొత్త సంవత్సరం రోజునే గల్వాన్ లోయలో చైనా పతాకం రెపరెపలాడిందంటూ చైనా అధికారిక మీడియా జర్నలిస్ట్ షెన్ షివె ట్వీట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. గల్వాన్ లోయ నుంచి చైనా ప్రజలకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు శుభాకాంక్షలు తెలియజేశారంటూ ట్వీట్ చేశారు.

దీనిపై రాహుల్ గాంధీ సహా కొందరు నేతలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘గల్వాన్ లో మన త్రివర్ణ పతాకమూ చాలా బాగుంటుంది. చైనాకు దీటైన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మోదీజీ.. ఇకనైనా మౌనాన్ని వీడండి’’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

అయితే, గల్వాన్ గొడవ జరిగిన ప్రాంతం నుంచి 1.2 కిలోమీటర్ల దూరంలో చైనా జెండాను ఎగరేసినట్టు గూగుల్ ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. 2020లో తూర్పు లడఖ్ లోకి అక్రమంగా ప్రవేశించిన చైనా సైనికులు.. మన దేశంతో గొడవకు దిగిన సంగతి తెలిసిందే. గల్వాన్ లోయలో మన జవాన్లపై ఘర్షణకు దిగడంతో కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు మరణించారు.

More Telugu News