Mayawati: యూపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని మాయావతి.. రాజకీయ వర్గాల్లో ఎన్నో సందేహాలు!

  • ఇంత వరకు ఒక్క సభ కూడా నిర్వహించని మాయావతి  
  • బయటకు రావమ్మా సోదరి అంటూ అమిత్ షా పిలుపు
  • అయినా కనిపించని స్పందన
  • బలం లేదన్న అంచనాలతో మిన్నకున్నట్టా? 
Where Is Mayawati BSP Leader Absence From UP Poll Campaign Sparks Speculation

యూపీ ముఖ్యమంత్రి పీఠాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి నాలుగు సార్లు అధిరోహించారు. దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. ఇదంతా గతం. ఇప్పుడు ఆమె ఎన్నికల ప్రచారానికి కూడా ఉత్సాహం చూపించడం లేదు.

మరో మూడు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, ఇతర చిన్నా చితకా పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. కానీ, మాయావతి ఇంకా ఇంటినుంచి బయటకు రాలేదు. ఎన్నికల ప్రచారానికి శంఖారావాన్ని పూరించలేదు. ప్రతిపక్షాల అధినేతలు ‘ఎక్కడకు వెళ్లావు బెహెన్ జీ’ అని పిలిచినా ఆమె పలకకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం, ఆసక్తిని కలిగిస్తున్నాయి.
 
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా స్వయంగా ‘‘సోదరి, ఎన్నికలు వచ్చాయి. కొంచెం బయటకు రండి. తర్వాత అని చెప్పకండి. అప్పుడు మీరు ప్రచారం చేయడానికి ఏమీ ఉండదు’’ అని ఇటీవల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, యూపీ ఎన్నికల ఇంచార్జ్ బాధ్యతల్లో ఉన్న ప్రియాంకా గాంధీ సైతం మాయావతి కనిపించకపోవడంపై స్పందించారు. మాయావతి మౌనంగా ఎందుకు ఉన్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.
 
ఎస్పీ తరఫున అఖిలేశ్ యాదవ్ ప్రచార బాధ్యతలు మోస్తుంటే, కాంగ్రెస్ తరఫున అగ్రనేతలు ప్రచారం చేపట్టారు. బీజేపీ తరఫున పీఎం మోదీ, సీఎం ఆదిత్యనాథ్, హోం మంత్రి అమిత్ షా, ఇతర నేతలు ప్రచార పర్వం నిర్వహిస్తున్నారు.
 
ఇక ఉత్తరప్రదేశ్ లో కీలక సంఘటనలు జరిగిన సమయంలోనూ మాయావతి నుంచి కనీస స్పందన రాలేదు. ఇప్పుడనే కాదు ఆమె మౌనంగా ఉండిపోయిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. అప్పుడు సైతం విమర్శల పాలయ్యారు. ఆమె మనసులో ఏముందో అర్థం చేసుకోవడం కష్టమేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. చివరిగా గతేడాది అక్టోబర్ లో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో మాయవతి కనిపించారు.
 
ఇదంతా చూస్తుంటే, గతమెంతో ఘనమని బీఎస్పీ గురించి చెప్పుకోవాలి. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో 403 సీట్లకు 206 సీట్లతో విజయదుందుభి మోగించారు. ఆ తర్వాత 2012 ఎన్నికల్లో ఎస్పీ 224 సీట్లను గెలుచుకుని మాయావతికి అధికారాన్ని దూరం చేసింది. అప్పుడు బీఎస్పీ 80 సీట్లకు పరిమితం అయింది. 2017లో బీజేపీ 312 స్థానాలను గెలుచుకోవడంతో బీఎస్పీ పాత్ర 19 నియోజకవర్గాలకు కుచించుకుపోయింది. తాజా ఎన్నికల్లోనూ బీఎస్పీ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదన్నది నిపుణుల అభిప్రాయం.

More Telugu News