రానా సాక్షిగా అర్ధాంగికి "ఐ లవ్యూ" చెప్పిన బాలయ్య... 'అన్ స్టాపబుల్' లో సరదా సన్నివేశం

02-01-2022 Sun 22:00
  • బాలకృష్ణ హోస్ట్ గా 'అన్ స్టాపబుల్' టాక్ షో
  • తాజా ఎపిసోడ్ లో రానా సందడి
  • ప్రోమో విడుదల
  • తనదైన శైలిలో రక్తి కట్టించిన బాలయ్య
Rana attends Balakrishna talk show Unstoppable
ఆహా ఓటీటీ వేదికపై ప్రసారమయ్యే 'అన్ స్టాపబుల్' కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రత్యేకతను తీసుకువచ్చారు. ఈ టాక్ షోకు తనదైన శైలిలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆయన, ఇతర ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్న తీరు మిగతా హోస్ట్ లకు భిన్నంగా ఉంటోంది. తద్వారా అభిమానులు కొత్తదనం ఆస్వాదిస్తున్నారు.

తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోకి నటుడు దగ్గుబాటి రానా విచ్చేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రానా...  బాలయ్యను భార్యాభర్తలకు చెందిన కొన్ని ప్రశ్నలు అడిగారు. "ఇద్దరూ గొడవపడితే ఎవరు ముందు సారీ చెబుతారు? అని ప్రశ్నించగా, "నేనే" అంటూ బాలయ్య ప్లకార్డు చూపించారు. "శ్రీకృష్ణుడు అంతటివాడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు, బాలకృష్ణుడు ఒక లెక్కా!" అంటూ చమత్కరించారు.

ఆ తర్వాత "మీ భార్యకు ఎప్పుడైనా ఐ లవ్యూ అని చెప్పారా? అని రానా ప్రశ్నించగా, "నీకెందుకయ్యా!" అంటూ బాలయ్య చిరుకోపం ప్రదర్శించారు. అనంతరం తన అర్ధాంగి వసుంధరకు ఫోన్ చేశారు. "ఐ లవ్యూ వసూ" అంటూ పేర్కొనగా... "ఎప్పటికీ మీరు నన్ను ప్రేమిస్తుంటారని నాకు తెలుసు" అంటూ వసుంధర బదులిచ్చారు. దాంతో బాలయ్య ముఖం మరింత వెలిగిపోయింది. ఈ మేరకు 'అన్ స్టాపబుల్' టాక్ షో తాజా ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుదలైంది.