TSRTC: సంక్రాంతి ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. అదనపు చార్జీలు లేకుండానే సర్వీసులు!

  • తెలంగాణ నుంచి ఏపీ వెళ్లే ప్రయాణికులకు ఊరట!
  • పండుగ బాదుడు లేకుండానే ‘పండుగ స్పెషల్స్’
  • మొత్తంగా 4,900 బస్సులు
  • ఏపీలోని 30 ముఖ్య పట్టణాలకు సర్వీసులు
TSRTC Good news for festival passengers

సంక్రాంతికి సొంతూళ్లు వెళ్లాలనుకునే వారికి టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. పండుగ రద్దీని నియంత్రించేందుకు అదనపు బస్సులు నడపాలని నిర్ణయించిన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికులపై ఎలాంటి అదనపు చార్జీలు మోపకుండానే బస్సులు నడపాలని యోచిస్తున్నట్టు సమాచారం.

ఇందుకు సంబంధించి మరో ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతంలో నడిపినట్టుగానే ఈ సంక్రాంతికి 4,900 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ ఇప్పటికే నిర్ణయించింది. ఫలితంగా 2.50 లక్షల సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

ప్రత్యేక బస్సుల్లో 1,600కుపైగా ఆంధ్రప్రదేశ్‌లోని 30 ముఖ్య పట్టణాలకు నడుపుతారు. ఏపీకి వెళ్లే బస్సుల్లో దాదాపు లక్ష సీట్లకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించనున్నారు. కాగా, టీఎస్ ఆర్టీసీ దసరా సమయంలోనూ 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయకుండానే పండుగ స్పెషల్స్ నడిపింది. మరోవైపు, ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం దసరా సమయంలో 50 శాతం చార్జీలు వసూలు చేసింది. సంక్రాంతికి కూడా అదనపు చార్జీలు వసూలు చేయాలని ఏపీ అధికారులు ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది.

More Telugu News